– ఈ నెల 26లోపు వీధుల్లో చేరని 267 మందికి నోటీస్‌లిచ్చిన ప్రిన్సిపాళ్లు
– నేటితో ముగియనున్న జూనియర్ లెక్చరర్ల కాంట్రాక్ట్ గడువు
కాంట్రాక్ట్ లెక్చర్లపై అధికార బెదిరింపులు మొదలయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్ కోసం ముందస్తు నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లినా పట్టించుకోని ప్రభుత్వంగుడ్డిగా బెదిరింపులకు పాల్పడుతోంది. తాము చెప్పినట్లు వినకపోతే ఉన్న ఉద్యోగం ఊడబెరుకుతామన్నంతగా భయపెట్టేందుకు పూనుకుంటోంది. అందులోభాగంగానే ఈనెల 26లోపు విధుల్లో చేరని 267మంది కాంట్రాక్ట్ లెక్టరర్లకు ప్రిన్సిపాళ్లతో నోటీస్‌లు ఇప్పించింది. - కర్నూలు సిటీ
తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఈ నెల 2 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు గత నెల చివరి వారంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రభుత్వానికి నోటీస్‌లిచ్చారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తప్పని పరిస్థితిల్లో సమ్మెలోకి వెళ్లారు. వీరిని రెగ్యులర్ చేయడానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇంత వరకు ఒక్క సారి కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లతో చర్చలు జరపలేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్సీలతో చర్చలు జరిపి కాంట్రాక్ట్ లెక్చరర్ల చర్చలు సఫలమయ్యాయని, సమ్మె విరమించేందుకు ఒప్పుకున్నారని తప్పుడు ప్రచారం చేసి కాంట్రాక్ట్ లెక్చరర్ల సంక్షేమ సంఘంలోనే చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అదీ పారకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ నెల 26లోపు వీధుల్లోకి చేరిన వారికి మాత్రమే కాంట్రాక్ట్ గడువు పెంచుతామని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి మంత్రి ఆదేశాలను విస్మరించిన 267మంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల చేత నోటీసులు పంపారు.
మాట మార్చిన ప్రభుత్వం..
జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్, 14 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో 307, డిగ్రీ కాలేజీల్లో 79 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. కొందరు 16 ఏళ్లుగా పనిచేస్తుండగా మరికొందరు మూడేళ్లకు పైగానే పనిచేస్తున్నారు. వీరందరినీ 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత సాంకేతిక కారణాలు చూపుతూ కాలయాన చేస్తూ వస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 26వ తేదీలోపు వీధుల్లో చేరాలని ఆదేశాల ఇచ్చారు. ఈ మేరకు వీధుల్లో చేరక పోవడంతో మొదటగా 267 మందికి తిరిగి వీధుల్లో చేరలేదని నోటీస్‌లు ఇచ్చారు. వీరితో పాటు మరికొంత మందికి నోటీస్‌లు ఇచ్చారు. ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తోందని, రాబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులు వాపోతున్నారు.
ఏడాదిలో రెండు సార్లు కాంట్రాక్ట్ గడువు..
2000 సంవత్సరం నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వం అయినా 10 నెలల కాంట్రాక్ట్ గడువు పెట్టింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగానే నీరుగార్చేందుకు జూన్ - డిసెంబరు, జనవరి - మార్చి వరకు కాంట్రాక్ట్ నిబంధన పెట్టారు. ఈ నిబంధన వల్ల సమ్మె చేసిన ప్రతి సారి ప్రభుత్వం గడువు పేరుతో బెదిరింపులకు దిగుతుండడం గమనర్హం.
ముందస్తు నోటీస్ ఇచ్చాం: టి.శివాంజనేయులు, కాంట్రాక్ట్ లెక్చరర్, నందికొట్కూరు
రెగ్యులర్ చేయాలని, సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ సమ్మె చేపట్టనున్నట్లు ముందుగానే ప్రభుత్వానికి నోటీస్‌లిచ్చాం. అయినా ప్రభుత్వం ఇలా నోటీస్‌లు ఇచ్చి బెదిరించడం తగదు. 10 ఏళ్లుగా పని చేస్తున్నా రెగ్యులర్ చేయక పోవడం బాధాకరం. ప్రభుత్వ అధికారం ఉందని ఇలా చేయడం సరి.
టీడీపీ ప్రభుత్వంలోనే ఏడాదికి రెండు సార్లు కాంట్రాక్ట్ గడువు: అంజన్‌కూమార్, ఒకేషనల్ జూనియర్ కాలేజీ, కర్నూలు
గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఏడాది రెండు సార్లు కాంట్రాక్ట్ గడువు పెట్టారు. ఈ నెల 31తో మొదటి గడువు ముగియనుంది. ఇచ్చిన హామీని అమలు చేయాలని సమ్మె చేపడితే ఇలా నోటీస్‌లు ఇచ్చి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరించే ధోరణి అవలంభించడం సమంజసం కాదు.