పాతవే ఖాళీ.. కొత్తవెందుకు మళ్లీ? | old empty .. new again? | Sakshi
Sakshi News home page

పాతవే ఖాళీ.. కొత్తవెందుకు మళ్లీ?

Published Tue, Aug 9 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

పాతవే ఖాళీ.. కొత్తవెందుకు మళ్లీ?

పాతవే ఖాళీ.. కొత్తవెందుకు మళ్లీ?

  • జిల్లాలో 92,500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్య గోదాంలు
  • పూర్తికావొచ్చిన 45 నూతన గోడౌన్ల నిర్మాణం
  • కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తేనే రైతులకు ఉపయోగం
  • వరంగల్‌ సిటీ : ఏ పనైనా అవసరం మేరకు చేస్తేనే ఉపయోగం ఉండడమే కాకుండా.. ఆ పని చేసినందుకు ఫలితం దక్కుతుంది. కానీ ప్రభుత్వం మంజూరు చేసింది కదా అని అవసరం లేదనే చెప్పే ధైర్యం లేకో.. మరేదైనా కారణమో తెలియదు కానీ భారీగా సరుకులు నిల్వ చేసే గోదాంల నిర్మాణానికి మార్కెటింగ్‌ శాఖ అధికారులు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఇప్పటికే పెద్దసంఖ్యలో గోదాంలు.. అదీ వేల మెట్రిక్‌ టన్నుల సరుకులు నిల్వ చేసే సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయి. ఇందులో చాలావరకు సరుకులు నిల్వ చేయకపోగా.. వృథాగా మారాయి. అయినా మరో 45 గోదాంలు నిర్మాణం చేపడుతుండడం గమనార్హం. ఇవి కాకుండా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తే అటు రైతులకు ఉపయోగం.. ఇటు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి పేరు దక్కేది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
    93 గోదాంలు...
    జిల్లాలో ఇప్పటికే 92,500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 93 గోదాములు ఉన్నాయి. వీటన్నింటిల్లో ఎప్పుడు కూడా 50వేల మెట్రిక్‌ టన్నుల పంట సరుకులు నిల్వ చేసిన పరిస్థితి లేదు. అయినా జిల్లాలో మరో 45 భారీ గోదాంలు నిర్మిస్తున్నారు. దాదాపు 5వేల నుంచి 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల వీటి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఇవన్నీ పూర్తయితే 2,17,500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యానికి పాతవి కలిస్తే 3లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఇప్పటికే గోదాంలు వృథాగా ఉంటుండగా.. కొత్తవి నిర్మాణం జరిగాక ఇందులో ఏం నిల్వ చేస్తారో అధికారులే చెప్పాల్సి ఉంది.
    మార్కెట్‌లోనే 44వేల 
    మెట్రిక్‌ టన్నులు
    వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లోనే 34వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్‌ సమీపంలోని ముసలమ్మకుంట ప్రాంతంలో 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాం నిర్మాణం పూర్తికావొస్తోంది. ఇప్పటికే ఉన్న గోదాంలను ఎన్నికల సమయంలో ఈవీఎం స్ట్రాంగ్‌ రూంలుగా, భద్రతా సిబ్బందికి షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు.
    ఆ ఆలోచన ఎందుకు రాలేదు?
    అవసరం లేకున్నా గోదాంలు నిర్మాణానికి సిద్ధమైన మార్కెటింగ్‌ శాఖ అధికారులు కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై ఎందుకు దృష్టిసారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పెద్దమెుత్తంలో గోదాంలో ఖాళీగా ఉంటుండగా.. కొత్త వాటి నిర్మాణంతో రైతులకే కాదు ఎవరికీ ఉపయోగం ఉండదనేది సుస్పష్టం. వీటికి బదులుగా కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తే పత్తి, మిర్చి తదితర పంటలకు తక్కువ ధర ఉన్నప్పుడు రైతులు నిల్వ చేసుకునే వీలు కలిగేది. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడంతో ఎక్కువ కిరాయి చెల్లిస్తూ ప్రైవేట్‌ కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా మార్కెటింగ్‌ అధికారులు కోల్డ్‌ స్టోరేజీలు కాకుండా.. పెద్దసంఖ్యలో గోదాంల నిర్మాణానికి సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement