గొంతుకోసి చంపేశారు
చాగల్లు: చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో వృద్ధురాలిని దారుణంగా హతమార్చి బంగారు ఆభరణాలు దోచుకుపోవడంతో పాటు మృతదేహాన్ని మూటగట్టి స్టోర్ రూమ్‌లో ఉంచిన ఘటన సంచలనం కలిగించింది. గ్రామ నడిబొడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నూతలపాటి నాగరత్నం (68) అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా గొంతుకోసి హతమార్చడంతో పాటు ఆమె వంటిపై ఉన్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన భగవతుల కృష్ణమూర్తి భార్య ఐదు నెలల క్రితం చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. కొంతకాలం క్రితం కృష్ణమూర్తి అక్క తాడేపల్లిగూడేనికి చెందిన నూతలపాటి నాగరత్నం అతడికి ఆసరాగా ఇక్కడకు వచ్చారు. కృష్ణమూర్తి ఇంటి ఆవరణలోని డాబాలో నాగరత్నం, పక్కనే ఉన్న పెంకుటింట్లో కృష్ణమూర్తి ఉంటున్నారు. మంగళవారం ఉదయం కృష్ణమూర్తి నిద్రలేచి నాగరత్నం ఉంటున్న గది వైపునకు వెళ్లి చూడగా ఆమె కనిపించలేదు. గదిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంది. దీంతో అక్క కోసం ఆయన బంధువుల సాయంతో గాలించారు. అయినా ఆమె కనిపించలేదు. సాయంత్రం ఆయన చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఇంటికి వచ్చిన ఆయన ఆవరణలోని స్టోర్ రూమ్ తలుపుతీసి చూడగా పెద్ద మూట కనిపించింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాగల్లు ఏఎస్సై ఎం.ధనరాజు సిబ్బందితో వచ్చి మూటను విప్పి చూడగా నాగరత్నం మృతదేహం ఉంది. ఆమె గొంతు కోసిన గాయాలు కనిపించాయి. ఆమె వంటిపై ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు లేవని కృష్ణమూర్తి, నాగరత్నం కుమార్తె నిరుపమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, ఎస్సైలు ఎం.జయబాబు, భగవాన్‌ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పథకం ప్రకారమే హత్య!
దుండగులు ముందస్తు పథకం ప్రకారమే నాగరత్నాన్ని హతమార్చినట్టు హత్య జరిగిన తీరును బట్టి తెలుస్తుంది. సోమవారం రాత్రి నాగరత్నం నిద్రపోయిన గది నుంచి ఇంటి ఆవరణలోని స్టోర్ రూమ్ వరకూ ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా దుండగులు జాగ్రత్త పడ్డారు. ఆమె ఉపయోగిస్తున్న రెండు దుప్పట్లలోనే మృతదేహాన్ని మూటగట్టి స్టోర్ రూమ్‌కు తరలించారు. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.