ఓంశాంతి శాంతి శాంతిః
ఓంశాంతి శాంతి శాంతిః
Published Wed, Sep 21 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
ఏలూరు సిటీ : ‘సత్యం, అహింస’ ఆయుధాలుగా శాంతిమార్గంలో పయనించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్ముడు నడిచిన నేల ఇది. మువ్వన్నెల జాతీయ పతకంలోనూ శాంతికి ప్రతీకగా శ్వేతవర్ణాన్ని చేర్చిన ఘనత మన భారతదేశానిది. ప్రపంచశాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ అనే ఆధునిక సాంస్కృతిక కళా ప్రదర్శన చేశారు. బుధవారం స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో సుమారు 800 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతమాతకు, మహాత్మాగాంధీకి వందన సమర్పణ దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
శాంతి స్థాపనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నారాయణ విద్యా సంస్థల డీజీఎం ఎంవీఎస్ బ్రహ్మాజీ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో శాంతి స్థాపనకు కృషి చేసి అసువులు బాసిన పోలీసు ఉన్నతాధికారుల చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుందన్నారు. ప్రజలంతా శాంతి, ఐక్యతతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాళ్లు డి.సునీల్‌కుమార్, కె.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement