–మరోసారి పెరిగిన పెట్రో ధరలు
–పెట్రోల్‌పై రూ.1.34, డీజిల్‌పై రూ.2.37 పెంపు
–15 నెలల్లో 15 సార్లు పెంపు
–గగ్గోలు పెడుతున్న వాహనదారులు
తణుకు :
పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 15 నెలల కాలంలో ఏకంగా 15 సార్లు డీజిల్ ధర, 12 సార్లు పెట్రోలు ధర పెంచింది. ఈ పరిస్థితుల్లో వాహనదారులపై భారీగానే భారం పడుతోంది. దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లీటరు పెట్రోలుపై రూ. 1.34, లీటరు డీజిల్‌పై రూ. 2.37 పెంచిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు.
పెరుగుదల ఇలా..
2015 ఏప్రిల్ 16న పెట్రోల్‌పై రూ. 0.87 కేంద్రం పెంచింది. మే 1న డీజిల్‌పై రూ. 2.47, పెట్రోలుపై రూ. 4.20 పెరిగింది. అదే నెల 16న లీటరు డీజిల్‌పై రూ. రూ. 2.94, పెట్రోలుపై రూ. 3.41, జూన్ 16న పెట్రోలుపై రూ. 0.70, అక్టోబరు 1న డీజిల్‌పై రూ. 0.53, నవంబరు 1న డీజిల్‌పై రూ.1.03, 16న డీజిల్‌పై రూ.0.92, పెట్రోలుపై రూ.0.32, డిసెంబర్ 1న డీజిల్‌పై రూ. 0.24, పెట్రోల్‌పై రూ.0.61 పెంచారు. 2016 జనవరి 1న లీటర్ డీజిల్‌పై రూ.1.11, పెట్రోలుపై రూ.0.66, ఫిబ్రవరి 1న లీటర్ డీజిల్‌పై రూ. 0.07, 18న రూ. 0.29, మార్చి 1న లీటరు డీజిల్‌పై రూ. 1.58, 17న రూ. 1.97, పెట్రోలుపై రూ. 3.16, ఏప్రిల్‌లో డీజిల్‌పై లీటరుకు రూ. 4.10, పెట్రోలుపై రూ. 3 చొప్పున కేంద్రం పెంచింది. మే 1న లీటర్ పెట్రోలుపై రూ.1.06, డీజిల్‌పై 2.94, 17న పెట్రోలుపై రూ.0.83, డీజిల్‌పై రూ.1.26 పెంచారు. తాజాగా డీజిల్‌పై రూ. 2.37, పెట్రోల్‌పై రూ. 1.34 పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
రూ.4 కోట్లు భారం
2015 ఏప్రిల్ నుంచి 2016 ఏప్రిల్ వరకు వరకు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో వాహనదారులపై సుమారు రూ.4 కోట్లు భారం మోస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో వినియోగదారులపై సుమారు రూ.50 లక్షలు అదనపు భారం పడుతోంది. జిల్లాలో 80 పైగా పెట్రోలు బంకులు ఉండగా రోజుకు 10 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు, 7 లక్షల పెట్రోలు అమ్మకాలు జరుగుతుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పుడు కూడా పది పైసలు.. ఇరవై పైసలు మాత్రమే తగ్గించి, పెరిగినప్పుడు మాత్రం రూపాయి, రెండు రూపాయల మేర వడ్డించడాన్ని వినియోగదారులు తప్పుబడుతున్నారు.