సర్టిఫికేట్ ఒకటే..పోస్టులు రెండు
సర్టిఫికేట్ ఒకటే..పోస్టులు రెండు
Published Sat, Mar 4 2017 11:19 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
వేరే వ్యక్తి సర్టిఫికెట్ జత చేసి ఉద్యోగం పొందిన వైనం
ఆధార్, రేషన్ కార్డుల్లో కూడా పేరు మార్పు
గుడ్డిగా ఓకే చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
అధికారులు బయటపడినా దర్యాప్తు నత్తనడకే
ప్రజాధనం వృథా అవుతున్నా కిమ్మనని ఐసీడీఎస్ అధికారులు
జిల్లా కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మీరు చదువుకోలేదా...ఎటువంటి సర్టిఫికెట్ లేదా... అయినా ఫర్లేదు మీకు ఉద్యోగం కావాలి అంతే కదా. అయితే ఎవరో ఒకరి సర్టిఫికెట్ తెచ్చుకోండి. మిగతాదంతా మేం చూసుకుంటాం అంటున్నారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొం దరు ఉద్యోగులు. ఇంకా మీకు అనుమానాలున్నాయా... ఐసీడీఎస్‌లో ఒకే ఎనిమిదో తరగతి సర్టిఫికెట్‌పై వేర్వేరు పోస్టుల్లో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ‘మేం ఉన్నాం కదా’ అని భరోసా ఇస్తున్నారు. ఈ బాగోతానికి సంబంధించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో వేర్వేరు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే ఎనిమిదో తరగతి సర్టిఫికెట్ జత చేసి ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. అందులో ఒక మహిళ అంగన్‌వాడీ కేంద్ర వ ర్కరు, మరో మహిళ ఆయాగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్ర జాధనం వృథా అవుతున్నా ప్రలోభాలకు లోబ డి ఐసీడీఎస్ అధికారులు మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి. రాజ వొమ్మంగి మండలం కొమరాపురం గ్రామానికి చెందిన కోనల రామస్వామి కుమార్తె కోనల వెంకట లక్ష్మి అక్కడ ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో సుమారు పదేళ్ల నుంచి హెల్పర్ (ఆయా)గా పనిచేస్తోంది. ప్రత్తిపాడు మండలం ఉప ప్రణాళిక ప్రాంతమైన బురదకోట గిరిజన గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి వర్కర్ పోస్టు నియామకం కోసం ఎనిమిదేళ్ల కిందట శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టు కోసం కోనల అచ్చయ్య కుమార్తె కోనల లక్ష్మి దరఖాస్తు చేసుకుంది. అయినా సరిపడా విద్యార్హత ఆమెకు లేదు. అందుకు ఆమె పెద్ద పథకమే వేసింది. తన ఇంటి పేరుతోపాటు తన పేరుతో దగ్గరగా ఉండి రాజవొమ్మంగిలో అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న కోనల వెంకటలక్ష్మి ఎనిమిదో తరగతి సర్టిఫికెట్‌ను జతచేసి అంగన్‌వాడీ వర్కర్ పోస్టుకు దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తును కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా స్త్రీశిశు సంక్షేమ అధికారులు లక్ష్మీకి అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాన్ని కట్టబెట్టేశారు.
అన్నింటా పేరు మార్చేసి...
అంగన్‌వాడీ వర్కర్‌గా నియామకానికి ముందు కోనల లక్ష్మి ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీ పరిధిలోని భాపన్నధారలో చిన్నారుల నివాస కేంద్రంలో సహాయకురాలిగా పనిచేసింది. అంగన్‌వాడీ వర్కర్‌గా నియామకం అనంతరం కోనల లక్ష్మి తన పేరును రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో కోనల వెంకట లక్షి్మగా నమోదు చేయించుకుంది. ఎనిమిదేళ్ల నుంచి కోనల లక్ష్మి ... కోనల వెంకట లక్షి్మగా బురదకోట అంగన్‌వాడీ కేంద్రంలో వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
కలెక్టర్ ఆదేశించినా...
రాజవొమ్మంగి అంగన్‌వాడీ హెల్పర్ కోనల వెంకట లక్ష్మి తన సర్టిఫికెట్లతో మరో మహిళ ఉద్యోగం చేస్తోందని తెలుసుకొని రెండేళ్ల క్రితం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేశారు. తన సర్టిఫికేట్‌తో బురదకోట అంగన్‌వాడీ కేంద్రంలో వర్కర్‌గా పని చేస్తున్న లక్షి్మపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా ఇంతవరకు విచారణ చేయలేదు. గత ఏడాది శంఖవరం మండలం పెదమల్లాపురంలో నిర్వహించిన గిరిజన సదస్సులో కూడా విచారణ నిర్వహించి చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. బురదకోట పంచాయతీ పరిధిలో బాపన్నధార సహా పలు గ్రామాల గిరిజనులు ఐటీడీఏ పీఓకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రెండు పర్యాయాలు కాకినాడ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్సులో కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఇది జరిగి కూడా ఏడాది దాటిపోయినా పట్టించుకున్న నాథుడే లేడు.
విచారణ నిర్వహించినా...
బురదకోట అంగన్‌వాడీ వర్కర్ వి«ధి నిర్వహణలో అలక్ష్యం చేస్తోందని, తొమ్మిది నెలల్లో కేవలం 28 రోజుల మాత్రమే కేంద్రాన్ని తెరిచారని మూడేళ్ల క్రితమే 2014 జూన్ 16న పిల్లల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి టి.నాగమణి స్థానిక గిరిజనుల సమక్షంలో విచారణ నిర్వహించినా ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గిరిజనం ఆరోపిస్తోంది. ఏ విద్యార్హతలతో పోస్టింగ్ ఇచ్చారో తెలియజేయాలని బాపన్నధార గ్రామానికి చెందిన ముర్ల రాజబాబు, విప్లవకుమార్ గత నెలలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఇటీవల బురదకోటలో శంఖవరం, రాజవొమ్మంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను, అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ తదితరులను ఐసీడీఎస్ అధికారులు విచారించారని తెలిసింది.
Advertisement
Advertisement