సాక్షి, హైదరాబాద్: ఇక్కడి పోలీసులు అరెస్టు చేసినా... తమ పాస్‌పోర్టు స్వాదీనం చేసుకున్నా...లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేసినా... రాకపోకలు, దందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నైజీరియన్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ దేశంలోనే అసలు, నకిలీ పేర్లతో రెండు పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అసలుది దాచేసి, నకిలీ పేరుతో తీసుకున్న దాంతోనే ప్రయాణాలు చేస్తున్నారు.
పోలీసులు అరెస్టు చేసినప్పుడూ ఇందులోని పేరే చెప్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నారాయణగూడ ఠాణా అధికారులు ఇటీవల అరెస్టు చేసిన వసిగ్వీ చిక్వమేక జేమ్స్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి అసలు పేరు, వివరాలు సైతం ఓ డెత్ సర్టిఫికెట్ ద్వారా బయటకు వచ్చాయి. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లు అవలంభిస్తున్న కొత్త పంథా ఇదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
గోవాకు వచ్చిపోతూ డ్రగ్స్ దందా...
నైజీరియాకు చెందిన వసిగ్వీ జేమ్స్ 2013 నుంచి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిపోతున్నాడు. 2016, 2019ల్లోనూ రాకపోకలు సాగించిన ఇతడికి గోవా, బెంగుళూరుల్లో ఉండే డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ జాక్స్ సరఫరా చేస్తున్న సింథటిక్ డ్రగ్స్‌కు అక్కడి పెడ్లర్స్‌కు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. ఇలాంటి నేరాలు చేస్తూ చిక్కిన వారి నుంచి పోలీసులు పాస్‌పోర్టు స్వాదీనం చేసుకుంటారు.
వీళ్లు బెయిల్ పొందినా దేశం దాటి వెళ్లిపోకుండా విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తారు. తనకు ఇలా జరిగితే స్వదేశానికి వెళ్లడం ఇబ్బందని భావించాడు. దీంతో 2021 నవంబర్ 19న నైజీరియాలోనే అలమాంజో మాసెక్సూ్య పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నారు.
నకిలీవి వాడుతూ వ్యవహారాలు..
డబ్బు అవసరమైన ప్రతిసారీ భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేయడం మొదలెట్టాడు. ఈ నకిలీ పేరుతో తీసుకున్న పాస్‌పోర్టు వాడి 2021–22ల్లో గోవాకు వచ్చాడు. తనకు పరిచయం ఉన్న కస్టమర్లను డ్రగ్స్ అమ్ముతూ ఈ ఏడాది మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంలో అలమాంజో పేరు చెప్పి, దాంతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. మూడు వారాలు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్లీ దందా మొదలెట్టాడు.
తాజాగా గత వారం నారాయణగూడ పరిధిలోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేయడానికి వచ్చి హెచ్–న్యూ పోలీసులకు చిక్కాడు. ప్రాథమిక విచారణలో తన పేరు అలమాంజో అని చెప్తూ ఆధారంగా ఆ పేరుతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. సాధారణ దర్యాప్తులో భాగంగా అధికారులు అతడి సెల్‌ఫోన్‌ను విశ్లేషించారు.
ఆమె డెత్ సర్టిఫికెట్‌తో గుట్టురట్టు...
ఇందులోని ఈ–మెయిల్స్, ఇతర పత్రాల్లో వసిగ్వీ జేమ్స్ అనే పేరు కనిపించింది. దీనిపై ప్రశ్నించగా... అసలు ఆ ఫోనే తనది కాదంటూ తప్పించుకున్నాడు. గోవాలో తనతో సహజీవనం చేసిన ఓ యువతి గతంలోనే అనారోగ్యంతో మరణించిందని, ఆమె మీద ఒట్టేసి చెప్తున్నానంటూ బుకాయించాడు. అయితే అనుమానం నివృత్తి కాని దర్యాప్తు అధికారులు ప్రతి ఈ–మెయిల్‌ను విశ్లేషించారు.
ఓ మెయిల్‌లో సదరు యువతికి సంబంధించిన డెత్ సరి్టఫికెట్ లభించింది. అందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆమె పేరుతో పాటు భర్తగా వసిగ్వీ చిక్వమేక జేమ్స్ పేరు ఉంది. దీని ఆధారంగా పోలీసులు అతగాడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో తన అసలు పేరు అదేనని అంగీకరించడంతో పాటు అలా ఎందుకు చేశాడో వివరించాడు. ఇటీవల అనేక మంది నైజీరియన్లు ఇలానే చేస్తున్నట్లు బయటపెట్టడంతో అ«ధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ఎంబసీకి లేఖ రాయాలని నిర్ణయించారు.
(చదవండి: మునా‘వార్’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్ ఫారూఖీ)
Comments
Please login to add a commentAdd a comment