ఒక్క క్లిక్‌.. | one click | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌..

Published Wed, Jul 5 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

ఒక్క  క్లిక్‌..

ఒక్క క్లిక్‌..

కర్నూలు (అర్బన్‌): ఒకే ఒక్క క్లిక్‌తో జిల్లాలోని బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌లో 550 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. జిల్లాలోని బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌లో ప్రతి ఏడాది ఎస్‌సీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్న నేపథ్యంలోనే ఈ విద్యా సంవత్సరంలో కూడా 5వ తరగతికి (రెసిడెన్షియల్‌) 350, 1వ తరగతికి (నాన్‌ రెసిడెన్షియల్‌)కు 200 సీట్లు కేటాయించారు. ప్రతి ఏడాది ఈ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన విద్యార్థులు మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసుకుంటే, స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా డిప్పు తీసి డిప్పు తగిలిన వారికి వారు కోరుకున్న పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ వచ్చారు.
 
అయితే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా పాఠశాలల్లో ప్రవేశం పొందాలంటే, ప్రతి విద్యార్థి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలోనే 1వ తరగతికి 360 మంది బాలురు, 290 మంది బాలికలు, 5వ తరగతికి 801 మంది బాలురు, 518 మంది బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులే ఎలక్ట్రానిక్‌ డిప్పు ద్వారా ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో జాబితాను ఉంచారు.  
 
అంతా రెండు నిమిషాల్లోనే..
బీఏఎస్‌ ప్రవేశాలకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర రాజధాని అమరావతిలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన జ్ఞానభూమి వెబ్‌సైట్‌ ద్వారా ఎంపికైన విద్యార్థుల జాబితాను డిస్‌ప్లే చేసేందుకు ఆన్‌లైన్‌ను ఓపెన్‌ చేశారు. ఆన్‌లైన్‌ ఓపెన్‌ అయిన వెంటనే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ –2 ఎస్‌ రామస్వామి కీ బోర్డు నుంచి సిస్టమ్‌లో కనిపిస్తున్న 1 నుంచి 10 అంకెల్లో ఒక అంకెను క్లిక్‌ చేశారు. అనంతరం తిరిగి మరో అంకెను క్లిక్‌ చేశారు. రెండు సార్లు రెండు అంకెలను క్లిక్‌ చేసిన 10 నిమిషాలకు 1, 5వ తరగతికి ఎంపికైన విద్యార్థుల జాబితా అదే వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అవుతుందని ఉన్నతాధికారి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. చెప్పిన విధంగానే ఎంపికైన విద్యార్థుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచారు. రెండు నిమిషాల్లోనే 550 మంది విద్యార్థుల ఎంపికను పూర్తి చేశారు.  
 
నిబంధనలపై తల్లిదండ్రుల ఆందోళన  
జీఓ నెంబర్‌ 101 ప్రకారం అనాథ పిల్లలకు 20 శాతం, జోగిని పిల్లలకు 15 శాతం, బాండెడ్‌ లేబర్స్‌ పిల్లలకు 15 శాతం సీట్లను, మిగిలిన 50 శాతం సీట్లను వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన పిల్లలకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటాయించిన వర్గాలకు చెందిన పిల్లలు లేని పక్షంలో ఆయా సీట్లను ఇతర కేటగిరీలకు కేటాయించడం జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఓలో పేర్కొన్న నిబంధనలను పాటించారా? లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ డిప్పు గురించి తనకు పెద్దగా ఐడియా లేదని, ఎలా విద్యార్థులను ఎంపిక చేశారనే విషయంలో తనకు స్పష్టత లేదని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు ప్రసాదరావు చెబుతున్నారు. కార్యక్రమంలో డీడీతో పాటు జిల్లా సాంఘిసంక్షేమ అధికారి ప్రకాష్‌రాజు, కార్యాలయ పర్యవేక్షకులు మల్లికార్జున, షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement