‘టూ’ మచ్‌! | One student can only make one PG in VSU | Sakshi
Sakshi News home page

‘టూ’ మచ్‌!

Published Fri, May 5 2017 10:19 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

‘టూ’ మచ్‌! - Sakshi

‘టూ’ మచ్‌!

- వీఎస్‌యూలో ఒక విద్యార్థి ఒక పీజీ మాత్రమే చేయాలట
- రెండో పీజీకి ససేమిరా అంటున్న అధికారులు
- పీజీ సెట్‌ నోటిఫికేషన్‌లో నిబంధన
- ప్రకటనపై మండిపడుతున్న విద్యార్థులు


నెల్లూరు (టౌన్‌) : తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు విక్రమ సింహపురి యూనివర్సిటీ అధికారులు. వరుస వివాదాలు, రకరకాల ఆరోపణలు వెంటాడుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. రిజిస్ట్రార్‌ మారినా వర్సిటీ అధికారుల పాలన ఇష్టారాజ్యంగానే సాగుతోంది. తాజాగా యూనివర్సిటీలో ఒక పీజీ చేసిన విద్యార్థి మరొక పీజీ చేయకూడదనే నిబంధనను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని నిబంధన వీఎస్‌యూలో పెట్టడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీఎస్‌యూ అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు.

సామాన్య ప్రజలకు ఉన్నత విద్యను అందించే దిశగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2008) వీఎస్‌యూను స్థాపించారు. ఆ సమయంలో వర్సిటీకి కాకుటూరులో దాదాపు 50 ఎకరాలు కేటాయించారు. దీని అభివృద్ధికి తొలుత రూ.12కోట్లు మంజూరు చేశారు. యూనివర్సిటీ స్థాపించిన ఏడాది సుమారు 350 మంది విద్యార్థులు పీజీలో చేరారు. ప్రస్తుతం 600 మంది విద్యార్ధులు పీజీ చదువుతున్నారు. తొలుత 6 కోర్సులతో ప్రారంభించిన యూనివర్సిటీలో నేడు 22 కోర్సులను ఏర్పాటు చేశారు. అయితే వర్సిటీ అధికారుల తీరు, ఏకపక్ష నిర్ణయాలతో ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. రిజిస్ట్రార్‌గా శివశంకర్‌ ఉన్నపుడు అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.  వర్సిటీ మూలనిధి నుంచి ఫండ్‌ డ్రా చేయడంపై పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో విద్యార్థి సంఘాలవారు. అధ్యాపకులు ఉద్యమాలు చేశారు. ఇటీవల రిజిస్ట్రార్‌గా శివశంకర్‌ను తొలగించిన నేపధ్యంలో యూని వర్సిటీ అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశపడ్డారు. అయితే అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదు.

కమిటీ నిర్ణయం అంటున్న అధికారులు
డబుల్‌ పీజీకి ప్రవేశం నిరాకరణ అనే విషయమై యూనివర్సిటీ సలహా కమిటీ నిర్ణ యం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. ఈ కమిటీలో 13మంది సభ్యులుగా ఉంటారు. కమిటీకి వైస్‌ చాన్సలర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి మృతి ఘటన జరినప్పటి నుంచి డబుల్‌ పీజీ చేస్తున్న విద్యార్థులకు హాస్టల్‌ ప్రవేశాన్ని నిషేధిస్తూ జీఓ జారీ చేశారు. అయితే డబుల్‌ పీజీ చదివేందుకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.రాష్ట్రంలో అన్నియూనివర్సిటీల్లో డబుల్‌ పీజీ చేసేం దుకు అనుమతి ఇస్తున్నపుడు వీఎస్‌యూలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే కమిటీ నిర్ణయమంటున్నారు. ఈ నిబంధన వల్ల విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేందుకు అవకాశాన్ని కోల్పోతున్నారు. ప్రతి ఏటా పీజీ కోర్సుల్లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. అయినా వర్సిటీ అధికారులు మాత్రం మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తెగేసి చెబుతున్నారు. డబుల్‌ పీజీకి అనుమతి నిరాకరణపై విద్యార్థి సంఘాలు ఉద్యమాలకు సిద్ధపడుతున్నాయి. అయితే డబుల్‌ పీజీ అనుమతి నిరాకరణపై వర్సిటీ రిజి స్ట్రార్‌ చంద్రయ్య వివరణ కోసం ‘సాక్షి’ పలుమార్లు ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాలేదు.

నోటిఫికేషన్‌లో...
విక్రమ సింహపురి యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు గతనెల 20న నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం వర్సిటీలో 22 పీజీ కోర్సులున్నాయి. ప్రధానంగా మ్యా«థమేటిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, సోషల్‌వర్క్, ఇంగ్లీçషు, ఎకానమిక్స్, కామర్స్, పొలిటికల్‌ సైన్స్, టూరిజం, మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సులకు డిమాండ్‌ ఉంది. అయితే ప్రస్తుత పీజీ నోటిఫికేషన్‌లో అధికారులు కొత్త నిబంధనను చేర్చారు. వర్సిటీలో ఒక పీజీ చేసిన విద్యార్థి మరో పీజీ చేయకూడదని షరతు విధించారు. ఈ నిబంధనపై విద్యార్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని నిబంధనను వీఎస్‌యూలో పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో ఒక పీజీ చేసిన విద్యార్థి రెండో పీజీ చదివితే నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది పీజీ కోర్సుల్లో చాలామంది చేరక సీట్లు మిగిలిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు.

చాలా దారుణం
రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనను వీఎస్‌యూలో అమలు పరచడం దారుణం. వర్సిటీలో రెండో పీజీ చేసేందుకు అనుమతి నిరాకరించడ వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఆది నుంచి అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో వీఎస్‌యూ వివాదాల వర్శిటీగా మారింది. డబుల్‌ పీజీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి.      
– నాయుడు రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు

 కమిటీ నిర్ణయం మేరకే నిబంధన
డబుల్‌ పీజీకి అనుమతి ఇవ్వకపోవడం యూనివర్సిటీ అడ్వైజరీ కమిటీ నిర్ణయం మేరకు జరిగింది. కమిటీ చేసిన తీర్మానాలను అమలు చేస్తున్నాం. సందేహాలుంటే వీసీ, రిజిస్ట్రార్‌ను అడగండి.
 – జవహర్‌బాబు. పీజీ సెట్‌ కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement