గోదావరి పుష్కర ఘోరానికి ఏడాది
తొలిరోజు 29 మంది మృతి.. బాబు ప్రచార యావే కారణమని విమర్శలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : 2015 జూలై 14.. గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. నాటి ఘోరానికి గురువారంతో ఏడాది పూర్తవుతోంది. ఇటు గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. అయినా ఈ ఘోరానికి బాధ్యులను గుర్తించడంలో, చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనకు చంద్రబాబు ప్రచారయావ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు నిలదీస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు.
ఇప్పటికీ బాధ్యులెవరో తేలలేదు..: సంఘటనపై పౌర సంఘాలు గొంతెత్తి నినదించిన మూడు నెలలకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 15న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్‌ను విచారణకు నియమించింది. ఆ కమిషన్ ఇప్పటికీ బాధ్యులెవరో తేల్చలేదు. పైగా.. ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీలు పుష్కరఘాట్‌లో గంటకు పైగా ఉండడంతోనే దుర్ఘటనకుకారణమని అప్పట్లో తూర్పుగోదావరి కలెక్టర్ రాష్ట్రపతికి, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు నివేదించారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో నివేదికలో మార్పులు చోటుచేసుకున్నారుు. భక్తులు తోసుకురావడంతోనే ప్రమాదం జరిగిందని రెండోసారి నివేదికలో పేర్కొన్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన నివేదికలివ్వడంలో ఆంతర్యమేమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
‘బాబు’ డాబు కోసమే 29 మంది బలిదానం..: నాటి విషాద ఘటనకు ప్రధాన కారణం.. వీఐపీ ఘాట్‌కు కాకుండా సామాన్యులు స్నానమాచరించే పుష్కర ఘాట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రావడమేనని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఘాట్ నుంచి సీఎం కుటుంబం బయటకు రాగానే గేట్లు తెరవడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ఘాట్‌లోకి పోటెత్తడంతో తోపులాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాలకు అంతర్జాతీయ ప్రచారం కల్పించాలని నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు పుష్కరాల షూటింగ్‌ను కాంట్రాక్ట్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ భక్తుల ప్రాణాలను పణంగా పెట్టిందని ప్రతిపక్షాలు సాక్ష్యాలు చూపిస్తున్నాయి. ఆ దుర్ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను ప్రభుత్వం కావాలనే మాయం చేసిందని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి.