ఉల్లి బంధం తెగుతోంది
ఉల్లి బంధం తెగుతోంది
Published Sun, Oct 16 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
– తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రాకుండా ప్రతిబంధకాలు
– కర్నూలు ప్రజాప్రతినిధుల రాజకీయాలు
– అక్కడి మార్కెట్‌లోనే విక్రయించాలని ఆదేశాలు
– సీజన్‌లో తగ్గిన ఉల్లిపాయల రాక
తాడేపల్లిగూడెం :
రాష్ట్రంలో ఉల్లిపాయలకు పుట్టిల్లు కర్నూలు అయితే మెట్టిల్లు తాడేపల్లిగూడెం. ఇది ఈనాటిది కాదు 50 ఏళ్లకు పైనుంచి కొనసాగుతున్న వాణిజ్య బంధం. ఉల్లి అక్కడ పండితే పంటంతా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రావాల్సిందే. ఇది వ్యాపార సూత్రంగా కాకుండా రైతు నమ్మకానికి ప్రతీకగా కర్నూలు ఉల్లివ్యాపారం అనాధిగా సాగుతోంది. తాము పడ్డ కష్టానికి తగ్గ ప్రతి «ఫలం గూడెం మార్కెట్‌లో వస్తుందనేది అక్కడి ఉల్లి వ్యాపారుల విశ్వాసం. తాడేపల్లిగూడెంలోని గుత్త వ్యాపారులు కర్నూలులోని ఉల్లి రైతులకు వడ్డీ లేకుండా పెట్టుబడులు సమకూరుస్తారు. రైతులు పండించిన సరుకును లారీలలో గూడెం మార్కెట్‌కు తీసుకువస్తారు. ఇక్కడ బహిరంగ పాట ద్వారా ఉల్లిపాయలను వ్యాపారులు విక్రయిస్తారు. విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములో కమీషన్ తీసుకుని మిగిలిన సొమ్మును రైతులకు ఇస్తారు. కర్నూలులో ఈ తరహా పద్ధతిలేదు. పైగా గూడెం వ్యాపారులకు కర్నూలు రైతులపై నమ్మకం ఎక్కువ. వెయ్యి బస్తాల సరుకు తెస్తే ఒక బస్తా కిందపోసి నాణ్యతను చూసి మిగిలిన 999 బస్తాలలో అదే తరహా నాణ్యతను ఉంటుందని నమ్మి పాట పెడతారు. కర్నూలు యార్డుకు వెయ్యిబస్తాల ఉల్లిని రైతులు తీసుకెళితే ఆ బస్తాలలోని సరుకును కింద పోస్తారు. నాణ్యతను బట్టి ధర ఇస్తారు. గూడెం మార్కెట్‌కు ఉల్లిపాయలను తీసుకురావడం వల్ల మరో వెసులుబాటు కూడా రైతులకు ఉంది. సరుకులు తీసుకొచ్చే సమయంలో మార్కెట్‌లో అననుకూల పరిస్థితుల కారణంగా ధర రాక, కిరాయిలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే కిరాయి సొమ్మును, అవసరమైతే రైతులకు అవసరమైన డబ్బును ఇక్కడి వ్యాపారులు ఇచ్చి పంపుతారు. అక్కడి రైతులపై నమ్మకంపై ఇక్కడి వ్యాపారులు ప్రతి సీజన్‌లో రూ.100 కోట్ల వరకు పెట్టుబడులుగా రైతులకు సమకూరుస్తున్నారు.
రెండేళ్లుగా సంక్షోభం
కర్నూలు ఉల్లిపాయల వ్యాపారంతో గూడెం వ్యాపారులు లాభపడుతున్నారని భావించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశాలతో ఉల్లిపాయలను కర్నూలులోనే విక్రయించాలనే ఆదేశాలు ఇచ్చారు. దీనిని అమలుచేయడానికి అధికారులు పక్కా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ విధానంలో గూడెం వ్యాపార విధానానికి, కర్నూలు యార్డు వ్యాపార విధానానికి వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోతూ వస్తున్నారు. దీంతో రెండు రకాల సెస్‌లు కట్టి ఉల్లి రైతులు సరుకును గూడెం మార్కెట్‌కు తెస్తున్నారు. అయ్యినా ఉల్లి వ్యాపారంలో రెండేళ్లుగా సంక్షోభం నెలకొంది. ఈ ఏడాది ఉల్లి రైతుల శ్రమ అక్కరకు రాకుండా పోయింది. సాగు విస్తీర్ణం పెరగడం, ఇక్కడి ఉల్లిపాయకు నిల్వ ఉండే గుణం లేకపోవడంతో గుత్త మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి రూ.100కి పడిపోయింది. నెలరోజులు ఇదే విధంగా ధర కొనసాగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.600 మద్దతు ధర ఇస్తామని ఓ ప్రకటన చేసింది. ఈ కారణంగా కర్నూలు వ్యాపారులు తాడేపల్లిగూడెంకు ఉల్లి తీసుకురాకుండా అక్కడి యార్డుకే సరకు తరలించారు. అయితే అక్కడ డిమాండ్ లేకపోవడంతో సరుకు విక్రయించుకోలేకపోతున్నారు. ఆ సరుకు కుళ్లిపోవడంతో నేలపై పారబోసుకుంటున్నారు.
గూడెంకు నిలిచిన ఉల్లి రవాణా
కర్నూలు ఉల్లిపాయలను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రైతులు తరలించకుండా అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకుంటున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఇక్కడి గుత్త మార్కెట్‌కు 20 లారీల సరుకు కూడా రాలేదు. వాస్తవానికి ఈ సీజన్‌లో కర్నూలు ఉల్లిపాయలు వారానికి 1,500 లారీలు రావాలి. అలాంటిది 40 లారీల సరుకు మాత్రమే వస్తోంది. ఈ ఆదివారం ఆ పరిస్థితి కూడా లేదు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి బంధం పూర్తిగా తెగిపోయినట్టే. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన రాహిత్యంతో తీసుకున్న చర్యలు కారణంగా ఇక్కడి వ్యాపారులు కోట్లలో నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ సీజన్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో అమ్మకాల ద్వారా కనీసం 25 శాతం సొమ్ములు కూడా రాలేదు.
ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు
ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో కర్నూలు ఉల్లిపాయల ధర పతనమైంది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. కనీసం పది టన్నుల దిగుబడి వస్తే పెట్టుబడులు పోను కొంచెం లాభం మిగులుతుంది. ఈ సీజన్‌లో క్వింటాల్ నాణ్యమైన ఉల్లి రూ.800 మించి పలకలేదు. ఇదే సమయంలో మహారాష్ట్ర ఉల్లిపాయలు కూడా అదే ధరకు లభిస్తుండడం, వాటికి నిల్వ ఉండే గుణం ఉండడంతో వాటినే వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామన్న మద్దతు ధర ఇచ్చినా రైతులకు రెక్కల కష్టం కూడా రాని పరిస్థితి. దీంతో కర్నూలు రైతులు ఉల్లిని వదిలి ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు.
Advertisement