ఆన్‌లైన్‌లో తలుపులమ్మ వివరాలు
-
తలుపులమ్మ లోవ వెబ్‌సైట్ ఆవిష్కరణ
-
భక్తుల సూచనలు, సలహాలు, ఫిర్యాదులకు ప్రాధాన్యం
తుని రూరల్ :
జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవదేవస్థానం వెబ్‌సైట్‌ను చైర్మన్ కరపా అప్పారావు ఆవిష్కరించారు. మంగళవారం దేవస్థానం కార్యాలయంలో ఈఓ ఎస్.చంద్రశేఖర్‌తో కలిసి చైర్మన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తలుపులమ్మలోవ.కం పేరుతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అమ్మవారి చరిత్ర, ప్రాచూర్యం తెలుసుకోవడంతోపాటు భక్తులనుంచి వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. అమ్మవారి విశిష్టతలు, ప్రత్యేక పూజలు, జాతరోత్సవాలు, శాశ్వత పూజా పథకాలు, శాశ్వత పులిహోర ప్రసాద వినియోగ ప«థకంలో భాగస్వాములయ్యేందుకు విరాళాలు స్వీకరణ వంటి వివరాలు అందుబాటులో ఉంచామన్నారు. ఏవరైనా నేరుగా అమ్మవారి విశేషాలను తెలుసుకోవచ్చని తెలిపారు.
ఒకటో తేదీ నుంచి శరన్నవరాత్రులు :
శక్తిపీఠాల్లో ఘనంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది నుంచి తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు చైర్మన్ అప్పారావు తెలిపారు. అమ్మవారికి అక్టోబర్ ఒక నుంచి 12వ తేదీవరకు రోజుకు ఒక అలంకరణ చేస్తామన్నారు. అదేవిధంగా జగన్నాథగిరి జంక్షన్లో ఉన్న నమూనా ఆలయం, తుని పట్టణం ఫీడర్‌రోడ్డులో ఉన్న ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తామని వివరించారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు యాదాల లోవకృష్ణ, అత్తి అచ్యుతారావు, నల్లాని చక్రవర్తుల వెంకటనారాయణాచార్యులు, కాకర్లపూడి వెంకటపుల్లంరాజు, ఎక్స్ ఆఫిషియో మెంబర్ దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.