ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదు
టీడీపీ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు.
ఎమ్మెల్యే జయరాం, ఎంపీ బుట్టా రేణుక
ఆలూరు : టీడీపీ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. ఆదివారం ఆస్పరి మండలం శంకరబండ సమీపంలో రూ.5 లక్షలతో నిర్మించిన బస్టాండు, తొగలగల్లులో రూ.6.50 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని వారు ప్రారంభించారు. తొగలగల్లులో సర్పంచ్ హరిజన కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అరకొర రుణమాఫీతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మంజూరు చేయిస్తున్నారని, ఇది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా విదల్చలేదన్నారు. గతంలోని పాలకుల ప్రణాళిక లోపంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశామన్నారు. ఇప్పటికే తాగునీటి సమస్య, విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
రోడ్ల మంజూరుకు ఎంపీ హామీ
ఆస్పరి మండలంలోని మారుమూల గ్రామాలైన యాటకల్లు, తొగలగల్లు, తువరగల్లు తదితర గ్రామాల్లో రోడ్ల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఎంపీని పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు విక్రాంత్‌రెడ్డి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, హాలహర్వి మండలాల కన్వీనర్లు చిన్న ఈరన్న, దొరబాబు, లుమాంబ, ఆస్పరి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాసులు, గోవర్ధన్, దత్తాత్రేయరెడ్డి, కేశవరెడ్డి పాల్గొన్నారు.
ప్రొటోకాల్‌ను విస్మరించిన ఆస్పరి అధికారులు : ఆస్పరి మండలం శంకరబండ, తొగలగల్లు, కారుమంచి తదితర గ్రామల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే హాజరైతే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు హాజరుకావాలి. ఇక్కడ అధికారులు గైర్హాజవడంపై ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీకి ఫిర్యాదు చేశారు.