ఓపెన్ లీక్ !
- పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు..
.కదిరి : కదిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభం కాకముందే స్టడీ సెంటర్ నిర్వాహకులకు లీకవుతోంది. సోమవారం జరిగిన పొలిటికల్ సైన్స్ ప్రశ్న పత్రంకు సంబంధించిన సమాధానాలన్నీ ఓ పేపర్‌లో పొందుపరచిన జిరాక్స్ కాపీలు ఆ పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులకు పంపిణీ చేయడం కన్పించింది. మీడియాతో పాటు పోలీసులు వారి వెంటబడితే వారి చేతిలో ఉన్న జిరాక్స్ కాపీలను అక్కడే పడేసి వారు పరారయ్యారు.
పరీక్ష ప్రారంభంకాకనే అన్ని ప్రశ్నలకు సమాధానాలన్నీ ముందే సిద్ధం చేసి, వందలాదా కాపీలు జిరాక్స్ చేశారంటేæ కనీసం 2 గంటల ముందే వారికి ప్రశ్నపత్రం తెలిసిపోయి ఉంటుందని అంటున్నారు. దీనిపై పోలీసులు బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలోని నిర్వాహకులను ప్రశ్నిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయనీ, మరి ఎక్కడి నుండి లీక్ అయిందో కానీ తామైతే ఇంకా బండిల్ కూడా తెరవలేదని చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు.
అయినా తీరు మారలేదు
కదిరిలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు చూచిరాతలను తలపిస్తున్నాయని ప్రతి రోజూ పత్రికల్లో వస్తున్నా, రోజూ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నా పరీక్షల నిర్వహణలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. పరీక్షా కేంద్రం ప్రధాన గేట్లు మూసేసి, ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల పర్యవేక్షణలోనే మాస్ కాపీయింగ్ జరుగుతోందని పరీక్ష రాస్తున్న అభ్యర్థులే కొందరు బహిరంగంగా చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆరాతీస్తే స్టడీ సెంటర్‌ల నిర్వాహకులు ముందే పథకం ప్రకారం తమకు అనుకూలమైన ఇన్విజిలేటర్లను, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించుకున్నారని తెలిసింది. వారందరికీ పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పడంతో వారే స్వయంగా కాపీలను అందజేస్తున్నారని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుండి రూ.10 వేల నుండి రూ.12 వేల దాకా వసూలు చేసినట్లు సమాచారం.