‘జవాబు’దారీతనం ఏదీ?
→ మూల్యాంకన నిబంధనలకు తిలోదకాలు
→ ఆలస్యం కానున్న దూరవిద్య పీజీ కోర్సుల ఫలితం
ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య పీజీ కోర్సులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనంలో ఆ విభాగం అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ, ఫలితాలు ప్రకటనలో కచ్చితంగా విధానాలు అనుసరించాల్సి ఉంది. కానీ వీటినన్నింటినీ పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టారు. దూరవిద్య పీజీ మొదటి సంవత్సరం 13 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్కో విద్యార్థి కోర్సుకు సంబంధించి ఐదు టైటిల్స్ రాశారు. అంటే 65 వేలు జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించారు.
ప్రైవేటు అధ్యాపకులతో..
వాస్తవానికి పీజీ జవాబు పత్రాలు రెండు దఫాలుగా మూల్యాంకనం చేయించాలి. ఇంటర్నల్ (వర్సిటీ ఆచార్యులు, అధ్యాపకులు) ఎక్స్‌టర్నల్ (బీఓఎస్ గుర్తించిన) అధ్యాపకులతో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. పీజీ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం జవాబు పత్రాల ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సూచించిన శాశ్వత అధ్యాపకులతో మూల్యాంకనం చేయించాలని నిబంధనలు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ప్రైవేటు డిగ్రీ కళాశాల అధ్యాపకులతో పీజీ జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం అయిన తరువాత ఇంటర్నల్ మూల్యాంకనం కోసం జవాబు పత్రాలు వర్సిటీ ప్రొఫెసర్ల వద్దకు పంపారు. అనర్హులైన వారితో మూల్యాంకనం చేయించారని ప్రొఫెసర్లు నిర్ధారించి ఇంటర్నల్ మూల్యాంకనం చేయమని కరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. దీంతో నిబంధనల అతిక్రమణ బహిర్గతమైంది.
ఫలితాలు ప్రకటన ఎలా ?
పీజీకి సంబంధించి ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మూల్యాంకనాలు నిర్వహిస్తేనే ఫలితాలు ప్రకటించడానికి సాధ్యమవుతుంది. ఎక్స్‌టర్నల్ మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకోవడంతో ఇంటర్నల్ మూల్యాంకనానికి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఫలితాలు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలిసింది.