
మహిళల భద్రతకు పెద్దపీట: ఎంపీ కవిత
హైదరాబాద్: మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిజామాబాద్ ఎంపీ కె.కవిత అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్‌షన్‌లో సైబరాబాద్ ‘షీ-టీమ్స్’ మొదటి వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ‘షీ -టీమ్స్’ను ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత విషయంలో రాజీపడరని దీని కోసం ఎంత ఖర్చు చేసైనా ప్రతీ ఒక్కరి రక్షణ తన బాధ్యతగా తీసుకుంటారన్నారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టి వాటిని ముందుకు తీసుకెళ్లడంలో సైబరాబాద్ పోలీసులు ముందుంటారని వారి సేవలు అభినందనీయమన్నారు.
సైబరాబాద్ సాఫ్ట్‌వేర్ ప్రాంతంలో 3.60 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని వారిలో 30శాతం మంది మహిలళే అన్నారు. వీరందరి భద్రతలో సైబరాబాద్ పోలీసుల కృషి హర్షనీయమన్నారు.షీ-టీమ్స్ ప్రవేశ పెట్టడం ద్వారా చాలామంది మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాలను వారికి చెప్పుకునే అవకాశం కలిగి, వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. సినీనటి జయసుధ మాట్లాడుతూ ‘షీ-టీమ్స్’కోసం రూపొందించిన షార్ట్ ఫిలింలో తాను పోలీసు అధికారిగా నటించడం తృప్తి నిచ్చిందన్నారు. తానూ పన్నెండేళ్ల వయస్సులో ఈవ్ టీజింగ్‌కు గురయ్యానంటూ ఆ ఆవేదన తనకు తెలుసునన్నారు.
సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖ మరింత ఆధునికతను ఏర్పరచుకుందన్నారు.ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కొనియాడారు.మహిళల రక్షణకు హైదరాబాద్ బ్రాండ్ గా మారిందన్నారు. పలుకేసులలో ఫిర్యాదులు చేసిన మహిళలకు ఈ సందర్భంగా జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి ఇంజనీరింగ్ విద్యార్థులు షీ-టీమ్స్‌తో కలసి హైటెక్స్ చార్మినార్ నుండి ఎన్‌కన్వెన్‌షన్ వరకు ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీపీలు కార్తికేయ, రమారాజేశ్వరీ,సి.వి.ఆనంద్ సతీమణి లలితా ఆనంద్‌లతో పాటు సైబరాబాద్ పోలీసులు, షీ-టీమ్స్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.