‘పాలమూరు’ భూసేకరణపై కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు సేకరించాలనుకుంటే తమకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం కరుకొండ గ్రామానికి చెందిన రైతులు పెట్టుకున్న వినతిపత్రాలను పరిశీలించాలని హైకోర్టు గురువారం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ల భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం జీఓ 123 కింద చర్యలు చేపట్టిందని, అధికారులు తమ భూ ములను బలవంతంగా తీసుకుంటున్నారని, దీనిని అడ్డుకోవాలని కారుకొండ గ్రామానికి చెందిన బి.స్వామిరావు, మరో 23 మందిరైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, జీవో 123ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. భూ ముల అమ్మడానికి ఆసక్తి కనబరిచే రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు విధి విధానాలను రూపొ ందిస్తూ జారీ చేసిన ఈ జీవో 123 వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. అంతేకాక భూ సమీకరణ సమయంలో బాధితులకు పునరావాసం కల్పిస్తామని పేర్కొన్న ప్రభుత్వం, తరువాత ఈ క్లాజును తొలగిస్తూ మరో జీఓ జారీ చేసిందని వివరించారు.
రైతుల నుంచి అధికారులు బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది (భూ సేకరణ) జువ్వాది శ్రీదేవి జోక్యం చేసుకుంటూ ఈ వాదనలను తోసిపుచ్చారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలేనన్నారు. తాము ఏ ఒక్క రైతు నుంచి బలవంతంగా సెం టు భూమిని కూడా తీసుకోవడం లేదని వివరించారు. నిబంధనల మేరకే భూ సేకరణ చేపడుతున్నామని చెప్పారు. తరువాత రచనారెడ్డి వాదనలను కొనసాగిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించేలా చూడాలంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల వినతిపత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అప్పటి వరకు పిటిషనర్ల భూముల జోలికి వెళ్లొద్దని అధికారులకు తేల్చి చెబుతూ ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.
రైతుల వినతులపై నిర్ణయం తీసుకోండి
Published Fri, Jun 17 2016 1:43 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM
Advertisement
Advertisement