‘పాలమూరు–రంగారెడ్డి’పై విచారణ 10కి వాయిదా
Published Tue, Apr 4 2017 2:03 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ ఎల్‌ఐఎస్) నిర్మాణ పనుల్లో భాగంగా తమ భూముల్లో అనుమతులు లేకుండా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ భూగర్భ పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేపట్టిందంటూ మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూర్ మండలం రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదనలు వినిపిస్తూ.. అటవీ ప్రాంతంలో చేపట్టే పనుల విషయంలో కొన్ని మార్గదర్శకాలున్నాయని చెప్పగా వాటిని తమ ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నవయుగ తరఫు సీనియర్ న్యాయవాది మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. కాగా, వ్యాజ్యంలో మరికొంత మంది రైతులను కూడా ప్రతివాదులుగా చేర్చాలని భావిస్తున్నారని, వారి వాదనలూ వినాలని న్యాయవాది రచనారెడ్డి కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని తెలిపింది.
Advertisement
Advertisement