బ్యాట్ పడితే పరుగుల వర్షమే..
హాయ్ చిన్నారులూ.. ఇక్కడ మీరు చూస్తున్న పల్లవి ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన ఆదినారాయణ, పార్వతి దంపతుల కుమార్తె. ఈమె గొందిరెడ్డిపల్లిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంతకు ఆమె గొప్పతనమేమంటే.. జాతీయ స్థాయిలో బాలికల క్రికెట్ జట్టులో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాగంటారా? జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన పల్లవి ఓపెనర్‌గా బరిలో దిగితే పరుగుల వర్షం కురుస్తుంది. అంతేకాదు వికెట్ కీపర్‌గాను అద్భుత ప్రతిభను చాటుకుంటోంది. అసలు ఇంతటి ప్రతిభాపాటవాలు ఎలా సిద్ధించాయి అనుకుంటున్నారు కదూ!.. అసలు విషయమేమంటే... 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆమె క్రికెట్‌పై మక్కువతో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది.
ఆమెలోని క్రీడాకారిణిని గుర్తించిన ఆర్డీటీ సంస్థ అకాడమీలో శిక్షణకు చేర్చుకుంది. అయితే ప్రతి రోజూ గొట్లూరు నుంచి అనంతపురం రావడం ఇబ్బందికరంగా మారడంతో కూతురు కోసం తండ్రి అనంతపురం నగర శివారుకు కుటుంబాన్ని మార్చాడు. అప్పటి నుంచి రోజూ ఆర్డీటీలో ఆమె క్రికెట్ శిక్షణ పొందుతూ వచ్చింది. ఇప్పటి వరకూ జిల్లా స్థాయి పోటీల్లో 12 సార్లు ఎంపికైంది. జోన్ స్థాయిలో 90 పరుగులతో అజేయంగా నిలిచింది. విజయనగరం, గుంటూరు ప్రాంతాల్లో జరిగిన సీనియర్ జోన్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఇక స్కూల్‌గేమ్స్‌లో జాతీయ స్థాయిలో రాణించింది. ఎలాగైనా భారత మహిళా క్రికెట్ జట్టులో స్థానం సాధించాలనే తపనతో ఆర్డీటీ కోచ్ యుగంధర్‌రెడ్డి వద్ద ప్రతిరోజూ ఆమె సాధన చేస్తోంది. సో... పల్లవికి మనందరమూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా..
- అనంతపురం సప్తగిరి సర్కిల్