వారంలోనే పాస్‌పోర్టు
వారంలోనే పాస్‌పోర్టు
Published Fri, Aug 26 2016 12:00 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
మర్రిపాలెం : ఒకప్పుడు పాస్‌పోర్ట్ పొందడం బోలెడంత ప్రయాసగా ఉండేది. కాలం వృథాతో పాటు చాలా డబ్బు ఖర్చు అయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. పాస్‌పోర్ట్ పొందడం సులభం అయ్యింది. దీంతో ఆదరణ పెరిగింది. గతంలో పాస్‌పోర్ట్ ధనిక వర్గాలకు అవసరంగా ఉండేది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యింది. ఒకటి, రెండు రోజుల వ్యవధిలో సాధారణ స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. 2014 ఏడాది జనవరిలో సాధారణ స్లాట్ బుకింగ్‌కు 45 నుంచి 48 రోజులు పట్టేది. అదే ఏడాది డిసెంబర్‌కు బుకింగ్ వ్యవధి 3 రోజులకు చేరింది. ప్రస్తుత రోజులలో ఒకటి, రెండు రోజుల వ్యవధిలో స్లాట్ లభించడం, కొన్ని రోజులలో ఖాళీలుగా ఉండటం జరుగుతోంది. పాస్‌పోర్ట్ సేవల చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అతి తక్కువ వ్యవధిలో స్లాట్ బుకింగ్ లభ్యం అవుతోంది. విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం నేతత్వంలో సేవలు వేగవంతంగా జరగడంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సులభంగా పాస్‌పోర్ట్‌లు పొందుతున్నారు.
గతంలో ఇలా...
గతంలో పాస్‌పోర్ట్ మంజూరుకు దరఖాస్తుతో పాటు ఆధార్, వయస్సు, గుర్తింపు, స్థానికత పత్రాలు అందజేయాలి. పాస్‌పోర్ట్ సిబ్బంది దరఖాస్తులోని అభ్యర్థి వివరాలు, ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో పోలీస్ శాఖకు పంపిస్తారు. పోలీసులు అభ్యర్థి ఇంటికి వెళ్లి పత్రాలలో చిరునామా, గుర్తింపు నిర్ధారించేవారు. అభ్యర్థి వివరాలు కచ్చితమని తేలితే పోలీసులు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో మరలా పాస్‌పోర్ట్ కార్యాలయానికి పంపేవారు. ఒకవేళ అభ్యర్థి చిరునామాలో లేకపోవడం, పత్రాలు, వివరాలలో లోటుపాట్లు ఉన్నట్టయితే పోలీసులు అదే విషయం ఆన్‌లైన్‌లో పొందుపరిచేవారు. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా పాస్‌పోర్ట్ కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభించేవారు. అంత వరకూ కార్యాలయంలో దరఖాస్తు పెండింగ్‌లో ఉండేది.
పోలీస్ విచారణతో పని లేకుండా...
ప్రజలకు వేగవంతంగా సేవలు అందించడానికి పాస్‌పోర్ట్ యంత్రాంగం సిద్ధపడింది. పోలీస్ విచారణతో పని లేకుండా పాస్‌పోర్ట్ ప్రక్రియ జరపాలని నిర్ణయించింది. అయితే అభ్యర్థి దరఖాస్తుతో పాటు వయస్సు, గుర్తింపు పత్రాలతో పాటు అదనంగా ఆధార్, ఓటర్ కార్డు, పాన్ కార్డ్ పత్రాలు అందజేయాలి. ఫారం ‘అనెక్సార్–ఐ’ సమర్పించాలి. వీటిని ఆన్‌లైన్‌లోని ఆయా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో వివరాల గూర్చి ఆరా తీస్తారు. పత్రాలు సక్రమంగా ఉంటే పాస్‌పోర్ట్ ప్రక్రియ ప్రారంభిస్తారు. మరోవైపు పోలీసుల విచారణ ఏకకాలంలో జరుపుతారు. పోలీసులు ఇచ్చే నివేదిక బట్టి అప్పటికే సిద్ధపరిచిన పాస్‌పోర్ట్‌ను అభ్యర్థికి అందజేస్తారు. ఒక వేళ పోలీస్ విచారణలో లోపాలు ఉన్నట్టయితే పాస్‌పోర్ట్ నిలిపివేస్తారు.
సులభంగా పాస్‌పోర్ట్ సేవలు
పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు సులభంగా అందేటట్టు ప్రయత్నిస్తున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు విస్తృతం చేశాం. గతంలో పాస్‌పోర్ట్ పొందడం అనేది మూడు నెలల ప్రక్రియ. ఇప్పుడు వారం రోజుల్లో చేతిలో పాస్‌పోర్ట్ ఉంటోంది. గతంలో పాస్‌పోర్ట్ రద్దీని తగ్గించడానికి ప్రత్యేక మేళాలు జరిపాం. సాధారణ స్లాట్ బుకింగ్ అందుబాటులోకి తీసుకువచ్చాం. దళారీలతో పనిలేకుండా సామాన్యులు పాస్‌పోర్ట్ నేరుగా పొందుతున్నారు.
ఎన్.ఎల్.పి.చౌదరి, పాస్‌పోర్ట్ అధికారి
Advertisement
Advertisement