పటేల్ గొప్ప దేశభక్తుడు : కిరణ్ రిజిజు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లబాయి పటేల్ గొప్ప దేశ భక్తుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పటేల్ 140వ జయంతిని పురస్కరించుకుని ‘ఐక్యతా దినోత్సవం’లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సభను నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సాగిన ఈ సభలో రిజిజు పాల్గొని మాట్లాడారు. ఒకే కుటుంబం, ఒకే పార్టీ దేశాన్ని అనేక ఏళ్లు పాలించిందని, వారి పాలన విభజించు - పాలించు అనే దోరణిలో కొనసాగిందని తెలిపారు. మోదీ రాకతో ఆ పార్టీకి పుట్టగతుల్లేకుండా పోయాయని తెలిపారు.
నేతాజీ తర్వాత భారతదేశ ముద్దుబిడ్డ పటేలేనని చెప్పారు.
ఆదిలోనే మత ఘర్షణలు అణచివేసి, దేశంలో శాంతి స్థాపనకు నడుంకట్టామని చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. పటేల్ జాతీయ సమైక్యతకు ప్రతీక అని చెప్పారు. ఆయన ఇచ్చిన ‘ఒక జాతి ఒకే ప్రజా’ను ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకుముందు బీజేపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వచ్చి శాసనసభ దగ్గర ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ జాతీయనేత మురళీధరరావు పాల్గొన్నారు.