
రోడ్డు ప్రమాదంలో పవన్ అభిమాని దుర్మరణం
నార్పల : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అభిమాని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూగూడుకు చెందిన దాసరి సూరి (28) గురువారం సాయంత్రం అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభకు వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. నరసాపురం మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సూరి రోడ్డు పక్కన గుంతలోకి పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానిక వ్యవసాయ కూలీలు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాంప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.