సీపీఎస్ రద్దుకు 10 వేల మందితో ఆందోళన
Published Thu, Aug 18 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ఎమ్మెల్సీ సూర్యారావు
ఉప్పలగుప్తం : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు పర్చకుంటే నంవంబర్‌లో 10 వేల మంది ఉద్యోగులతో ఢిల్లీ గడ్డపై ఆందోళనకు దిగుతామని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు చెప్పారు. బుధవారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్సీ సూర్యారావు గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలేకర్లతో మాట్లాడారు. 2004 సెప్టెంబర్ తరువాత విధుల్లోకి చేరిన 57 శాఖల్లో సుమారు లక్షన్నర వరకూ ఉన్న ఉద్యోగులు సీపీఎస్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగికి ప్రాథమిక హక్కులుగా ఉన్న పెన్షన్, గ్రాట్యుటీ కోల్పోతారని ఉద్యోగికి డెత్ గ్రాట్యుటీ లేకుండా పోతుందన్నారు. టీఎన్‌ఐటీ అంటూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ టెస్ట్‌లు పెట్టడం గురువును అవమానించడమేనన్నారు. ఈ విధానాన్ని విరమించుకోవాలని శాసన మండలిలో చెప్పామన్నారు. తన చారిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాన్ని బట్టి శిక్షణ, పేద విద్యార్థులకు ఉన్నత విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్సీ సూర్యారావు తెలిపారు. అంతకుముందు మండలంలో ఏడు ఉన్నత పాఠశాలను సందర్శించి ఎమ్మెల్సీగా తన గెలుపునకు సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మృతి చెందిన గొల్లవిల్లి జెడ్‌పీ ఉన్నతపాఠశాల హెచ్‌ఎం పివి రాంబాబు చిత్ర పటానికి సూర్యారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట యూటీఎఫ్ నాయకులు ఎ.రత్నాజీ, బీబీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement