కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలుపొందడం ఆ ప్రాంత వాసుల దౌర్భాగ్యమని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు విమర్శించారు.
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి): కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలుపొందడం ఆ ప్రాంత వాసుల దౌర్భాగ్యమని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శనివారం స్థానిక తెలంగాణ చౌరస్తా నుంచి ఎంపీ శవయాత్ర నిర్వహించి బీజేఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలని అక్కడి ప్రజలంతా ఎదురు చూస్తుంటే కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ చెప్పడం దుర్మార్గమన్నారు.
కేవలం వారి స్వలాభం కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల బాగోగుల గురించి ఏమి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత చేవెళ్లను కాదని ప్రస్తుతం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారన్నారు. జిల్లా వాసులకు అన్యాయం జరిగే పనులు చేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలోనే.. ప్రాణహిత చేవెళ్ల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరించారు.