ఖాళీ బిందెలతో ధర్నా
నెల్లూరు(అర్బన్): తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం 26వ డివిజçన్ కమిటీ ఆధ్వర్యంలో బుజబుజనెల్లూరు వాసులు గురువారం ఖాళీ బిందెలతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్, సీపీఎం రూరల్ నియోజకవర్గ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడారు. 20 రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అçప్పట్లో తాము చేసిన కృషితో కేంద్ర ప్రభుత్వం రూ.1.05 కోట్లతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించిందని చెప్పారు. కార్పొరేషన్లో తమ ప్రాంతం విలీనమయ్యాక సమస్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్‌కు ఉన్న నిధుల్లో కొంత ఖర్చు చేసి మోటార్ మరమ్మతులను చేపట్టాలని విన్నవించారు. తాగునీటిని వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. శాఖ కార్యదర్శి కొండా ప్రసాద్, నాయకులు బాబు, రమణయ్య, దశయ్య, రవి, బాలయ్య, వెంకటేశ్వర్లు, తిరుపాలు, ఐద్వా నాయకులు జబీనా, పద్మావతి, లావణ్య, లక్ష్మి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.