మోదీని విమర్శిస్తే ప్రజలు క్షమించరు
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
ఆదోని: ప్రధాని మోదీని విమర్శిస్తే ప్రజలు క్షమించబోరని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో కొంత మంది తెలుగు దేశం నాయకులు ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శిస్తున్న విషయాన్ని ఓ విలేకరి మంత్రి దృష్టికి తేగా ఆయనపై విధంగా స్పందించారు. శుక్రవారం ఆదోనిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, టీడీపీ నియోజక వర్గం ఇన్‌చార్జ్ మీనాక్షినాయుడు స్వగృహాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీకి ప్రజా మద్దతు ఏ స్థాయిలో ఉందో ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ఆసుపత్రులలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగైందన్నారు. డివిజన్ స్థాయిలోని ప్రతి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులను నియమించడంతోపాటు, ఇందుకు అవసరం అయిన వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని తెలిపారు. వైద్యసేవలు మెరుగు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ 32 శాతం, కాన్పులు 10 శాతం పెరిగాయని చెప్పారు.