• జమ్మికుంటలో రైలు కిందపడి మహారాష్ట వాసి మృతి
• బంధువులు, స్నేహితులు చూస్తుండగానే ఘోరం
• మృతుడు మాజీ ఆర్మీ పోలీసు ఉద్యోగి
జమ్మికుంట(హుజూరాబాద్) :
నీటికోసం రైలు దిగిన మాజీ ఆర్మీ జవాన్ తిరిగి ఎక్కుతుండగా ప్రమాదశాత్తు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైల్వేస్టేషన్‌లో జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చముర్సీ తాలుకా పరిధిలోని అస్టీ పోలీసు పరిధిలోని కనరాగావ్ గ్రామానికి చెందిన ప్రకాశ్ తాతాజీ కోవే (51) ఆర్మీలో ఉద్యోగం చేశాడు. మధ్యలోనే బయటకు వచ్చాడు. కుటుంబ పోషణకోసం తెలంగాణలోని పలుచోట్ల కాంట్రాక్టర్ల వద్ద సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. గత నెల26న గ్రామానికి చెందిన బాబేన్ బిష్ణు మండల్, విజయ్ మగమ్, నారయన్ సర్కార్‌తో కలిసి సిద్దపేట జిల్లాకు ఉపాధికోసం వచ్చాడు.
గురువారం రాత్రి కూలీ డబ్బు తీసుకొని నలుగురు నాగపూర్–అజ్మీర్ ప్యాసింజర్ రైలలో స్వగ్రామానికి వెళ్లేందుకు రైలుఎక్కారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు వచ్చే సరికి మంచినీళ్ల బాటల్ కొనేందుకు ప్రకాశ్ తాతాజీ కోవే రైలు దిగాడు. కొనుగోలు చేసి వెళ్లే సరికి రైలు కదిలింది. రైలు ఎక్కవద్దని కోరుతున్నా పరుగెత్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోయాడు. ఘటనలో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. వెంటనై బంధువులు చైన్‌లాగి రైలును ఆపారు. వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రకాశ్ తాతాజీ మృతి చెందాడు. తాతాజీ భార్య చంద్రకళ అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. కుమారుడు ప్రదీప్ ఉన్నత చదువులు చదువుతున్నాడు. కళ్లముందే తోటి మిత్రుడు చనిపోవడంతో కన్నీరుపెట్టారు. రైల్వే జీఆర్‌పీ సత్తయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.