
కాపు రిజర్వేషన్ల కోసం వ్యక్తి ఆత్మహత్య
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో చిక్కాల వెంకట రమణమూర్తి (53) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కలెక్టరేట్లో వికాస కార్యాలయం వద్ద అతడు సోమవారం టీవీ డిష్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో సూసైడ్నోటును స్వాధీనం చేసుకున్నారు. రమణమూర్తి సూసైడ్ నోట్లో ... కాపులను బీసీల్లో చేర్చాలి. పవన్ కల్యాణ్ కాపులకు ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురు చూశా. చివరకు ఎదురు చూపులే మిగిలాయి. పవన్ కల్యాణ్ ప్రశ్నించే పార్టీ అన్నారు. కానీ ప్రశ్నల్లేని పార్టీగా మిగిలిపోయింది. కాపు గర్జన ద్వారా అయినా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా' అని పేర్కొన్నాడు. మృతుడు కాకినాడ డైయిరీ ఫాం సెంటర్ కు చెందిన డీజిల్ మెకానిక్. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.