కోవూరు బైపాస్పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు జాతీయరహదారిపై శనివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వైట్ పెట్రోల్‌ను తరలిస్తున్న ట్యాంకరు అదుపుతప్పి నందలగుంట వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీక్లీనర్ మహేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ మల్లేష్ సురక్షితంగా బయటపడ్డాడు.
మరోవైపు ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఆ పెట్రోల్ను పట్టుకునేందుకు క్యూ కట్టారు. ఏకంగా బిందెలు, బక్కెట్లు, క్యాన్లతో పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఏ మాత్రం చిన్న అగ్గి రవ్వ పడినా పెను ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి జనాలు మరీ పెట్రోల్ కోసం బారులు తీరారు.
కొద్దిదూరంలో ఒక ఆకతాయి ఈ పెట్రోలు మండుతుందా లేదా ప్రయత్నించగా కొందరు స్థానికులు అతనిని దూరంగా తరిమివేశారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్యాంక్‌లో 20 వేల లీటర్ల పెట్రోల్ ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యంలు సంఘటనస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల్ని అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.