తేలని ‘భవిత’వ్యం!
– నిలిచిపోయిన ఫిజియో థెరపీ క్యాంపులు
– రెన్యూవల్‌కు నోచుకోని ఫిజియోథెరపిస్టులు
– సేవల కోసం ‘ప్రత్యేక’ పిల్లల ఎదురుచూపు
ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా నడుస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనం. విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెళ్లవుతున్నా...ఫిజియో థెరపిస్టులను తీసుకోలేదు. దీంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఫిజియో థెరపీ సేవల కోసం ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో ప్రత్యేక అవసరాలు బుద్ధిమాంద్యత (ఎంఆర్), దష్టి లోపం (బ్లైండ్), వినికిడి (హెచ్‌ఐ), సీపీ (సెరబ్రల్‌పాల్సీ) గల పిల్లలు అధికారిక లెక్కల ప్రకారం 6080 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ఐఈఆర్సీ (ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్), 43 మండలాల్లో నాన్–ఐఈఆర్సీలు ఉన్నాయి. ఈ పిల్లల కోసం ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) 115 మంది పని చేస్తున్నారు. తీవ్రతను బట్టి కొందిరి పిల్లలకు హోం బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు.
రెన్యూవల్‌కు నోచని ఫిజియో థెరపిస్టులు
ప్రతి సోమవారం ఐఈఆర్సీ కేంద్రాలు, బుధ, శుక్రవారాల్లో నాన్–ఐఈఆర్సీ కేంద్రాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. ఫిజియో థెరపిస్టులు వచ్చి పక్షవాతం, కాళ్లు, చేతులు సరిగా పని చేయకపోవడం, కండరాలు, ఎముకలు పట్టేసి నడవడానికి, పనులు చేసుకోవడానికి వీలుకాక ఇబ్బందులు పడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తారు. గతేడాది 26 మంది ఫిజియో థెరపిస్టులు జిల్లాలో పని చేశారు. ఈ సంవత్సరంలో మూడు మండలాలకు ఒక్కరి చొప్పున 21 మందిని తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ రెన్యూవల్ ప్రక్రియ జరగలేదు.
ఆయాలదీ అదే పరిస్థితి
మరోవైపు కేర్ గివర్ వలంటీర్ల (ఆయా)ను తీసుకోలేదు. వీరు లేకపోవడంతో భవిత కేంద్రాలకు తమ పిల్లలను పంపేందుకు కూడా తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. కేంద్రంలో ఉన్న సమయంలో ముఖ్యంగా బుద్ధిమాంద్య పిల్లలకు వ్యక్తిగత అవసరాలు వస్తే వాటిని తీర్చుకునేందుకు తోడు కచ్చితంగా అవసరం.
ఫిజియెథెరపీ క్యాంపులు పెట్టడం లేదు
కూడేరులోని భవిత కేంద్రంలో మూన్నెళ్లుగా ఫిజియో థెరపీ క్యాంపు నిర్వహించడం లేదు. నా మనవుడు సందీప్‌కు నరాల బలహీనతతో కాళ్లు సచ్చు(సెరబ్రల్) బడ్డాయి. ఫిజియోథెరఫి చేస్తే నరాలు బలపడతాయని వైద్యులు చెప్పారు. గతేడాదిలో భవిత కేంద్రంలో రెగ్యులర్‌గా చేయించాం. ప్రైవేటుగా వెళ్లి ఫిజియోథెర పీ చేయించుకోవాలంటే ఆర్థిక భారమవుతుంది.
– గోపాల్ ముద్దలాపురం, కూడేరు మండలం
అనుమతులు రావాలి
ఫిజియో థెరపీ క్యాంపులు లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమే. ఫిజియోథెరపిస్టులను తీసుకోవాలంటే పై నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గతేడాది 26 మంది పని చేశారు. ఈసారి మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టును తీసుకోవాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారం త్వరలోనే తీసుకుంటాం.
– పాండురంగ, ఐడీ కోఆర్డినేటర్