* ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్కింగ్ సిస్టమ్
(పిన్స్)యాప్‌ను ప్రవేశ పెడుతున్న పోలీసులు
* నూతన వెబ్‌సైట్ అందుబాటులోకి..
* ప్రాపర్టీ పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం
* బార్‌కోడింగ్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు
* ఇక స్టేషన్లలో వాహనాల తుప్పుకు చెల్లు
‘ సుబ్బారావు వాహనం ప్రమాదానికి గురైంది... పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు... ఒక సంవత్సరం తరువాత వాహనం కోసం స్టేషన్‌కు వెళ్లాడు. అప్పుడు తీసుకువచ్చిన పోలీసులు ఇప్పుడు లేరు. వాహనం తుప్పుపట్టి, దుమ్ముకొట్టుకుపోయి గుర్తుపట్టలేనట్లుగా ఉంది. వెళ్లి విధుల్లో ఉన్న పోలీసులను అడిగాడు. ఆ వాహనం ఏ కేసులో పట్టుకున్నదో తెలియని పరిస్థితి. రికార్డుల్లో ఎక్కడుందో కనిపించలేదు.
మర్నాడు రమ్మన్నారు. అలాంటి మర్నాడులు ఎన్నో పోయాయి. రోజులు వారాలై, వారాలు నెలలయ్యాయి. రికార్డూ దొరకలేదు. తిరుగుడూ తప్పలేదు. విసిగి విసిగి వేసారిన అతను వాహనంపై ఆశలు వదులుకుని వెళ్లిపోయాడు.’
ఇలాంటి పరిస్థితి ఇకపై పోలీస్‌స్టేషన్లలో దాదాపు కనిపించకపోవచ్చు. నూతన సాంకేతిక విధానంతో వాహనాలకు క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేసి ఎప్పుడైనా వాహనాల పూర్తి వివరాలను సెకనులో తెలుసుకునే విధంగా ‘ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్కింగ్ సిస్టమ్’ (పిన్స్)ను పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని ద్వారా తేలికగా వాహనాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన తిరిగి ఇచ్చేందుకూ ఈ సాఫ్ట్‌వేర్ దోహదపడుతుంది.
నూతన విధానం ఇలా..
* తొలుత యాప్‌స్టోర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు.
* ప్రాపర్టీ(వాహనం లేదా వస్తువు) వివరాలను నమోదుచేస్తారు. ఏరకం వస్తువు, ఎప్పుడు పట్టుకున్నారు, ఎఫ్‌ఐఆర్ నంబరు, సెక్షన్ ఆఫ్ లా, పోలీస్‌స్టేషను పేరు, ఇంజిన్‌మోడల్, ఐడీ నంబర్లు, ఛాసిస్ నంబరు, రిజిస్ట్రేషను నంబరు, సీజ్‌చేసిన అధికారి పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. తదనంతరం ప్రాపర్టీ ఫోటో తీసి అప్‌లోడ్ చేసి క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేస్తారు.
* క్యూఆర్ కోడ్‌ను పేపర్‌పై గానీ స్టిక్కర్‌పై గానీ ప్రింట్ తీస్తారు.
* క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను వెహికల్ లేదా సంబంధిత ప్రాపర్టీపై అతికిస్తారు.
* తదనంతరం ముందుగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న క్యూఆర్‌కోడ్ స్కానర్ ఓపెన్ చేసి వెహికల్‌పై అతికించిన స్టిక్కర్‌పై ఉంచగానే వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు మనముందు ప్రత్యక్షమవుతాయి.
సిబ్బందికీ శిక్షణ..
పిన్స్, క్యూఆర్‌కోడ్ స్కానర్‌ను ఇటీవలే అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్‌పై అవగాహన కలిగి ఉండి, పిన్స్‌లో వాహనాల వివరాలను నమోదు చేసే విధంగా కానిస్టేబుళ్లకు కూడా శిక్షణ ఇచ్చారు. వాహనానికి సంబంధించిన ఏయే వివరాలను నమోదు చేయాలి, నమోదు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాంకేతిక సమస్యలు తలెత్తితే ఏం చేయాలి.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.
సులువుగా ఉంటుంది..
పిన్స్‌లో వాహనాలు లేదా ప్రాపర్టీ వివరాలను నమోదు చేయడం వలన పని సులభతరం అవుతుంది. ప్రాపర్టీపై అతికించే స్టిక్కర్‌పై క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఆన్ చేసి ఉంచితే ఉన్నతాధాకారుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ సంబంధిత వస్తువు వివరాలను తేలికగా తెలుసుకోవచ్చు. పిన్స్, క్యూఆర్‌కోడ్ స్కానర్‌కు సంబంధించి ఇప్పటికే కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇచ్చాం. సద్వినియోగం చేసుకుంటే పోలీసుల్లో పారదర్శకత పెరుగుతుంది. ఇది మంచి సాఫ్ట్‌వేర్.
- జి.రవికుమార్, సీఐ, చేబ్రోలు సర్కిల్