తవ్వేస్తున్నారు | pipe line works by personnal | Sakshi
Sakshi News home page

తవ్వేస్తున్నారు

Published Sun, Sep 17 2017 11:00 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

తవ్వేస్తున్నారు - Sakshi

తవ్వేస్తున్నారు

‘అనంత’లో ఇష్టారాజ్యంగా పైపులైన్‌ పనులు
ఎక్కడికక్కడ సిమెంట్‌ రోడ్లు ధ్వంసం
మరమ్మతుల పేరుతో అ‘ధన’పు వ్యూహం
రూ.25 నుంచి రూ.30 కోట్ల మేర నిధుల దుర్వినియోగం
మామూళ్ల మత్తులో ‘అనంత’ పాలకులు


సాక్షిప్రతినిధి, అనంతపురం: ఈ ఫొటో చూశారా...అనంతపురం రెవెన్యూ కాలనీలోని రామాలయం ఎదురుగా ఉన్న రోడ్డు. తాగునీటి కొళాయి కనెక‌్షన్‌ పేరుతో రోడ్డును పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. దీంతో కాలనీలోని రోడ్డు నామరూపాల్లేకుండా పోతోంది. ఈరోడ్డుపై ఆటోలు, కార్లు, టూవీలర్లపై ప్రయాణం చేయాలన్నా.. చివరకు నడిచి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. రెవెన్యూ కాలనీలోనే కాదు...ఎర్రనేల కొట్టాలు, రాంనగర్‌లోనూ ఇదే విధంగా పనులు జరుగుతున్నాయి.

అనంతపురంలో నీటి సమస్య తీర్చేందుకు రూ.134 కోట్లతో ప్రభుత్వం టెండర్‌ పిలిచింది. ఐహెచ్‌పీ(ఇండియన్‌ హ్యూమ్‌ పైప్స్‌) కంపెనీ ప్రతిపాదిత ధర కంటే అధిక మొత్తం కోట్‌ చేసింది. చివరకు రూ.147 కోట్లకు ఐహెచ్‌పీకి టెండర్‌ దక్కింది.  368 కిలో మీటర్ల పైపులైన్, 10 తాగునీటి ట్యాంకులు (ఓహెచ్‌ఆర్‌) నిర్మించాలి. అగ్రిమెంట్‌ తేదీ నుంచి రెండేళ్లలోపు ఈ పనులు పూర్తి చేయాలి. 2016 ఏప్రిల్‌ 1న పనులు ప్రారంభించారు.  వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది.

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా..
రోడ్డుకు ఎడమవైపున ఉన్న తాగునీటి పైపులైన్‌ నుంచి కుడివైపున ఉన్న వారి ఇళ్లకు కనెక‌్షన్లు ఇచ్చేందుకు రోడ్డును ధ్వంసం చేస్తున్నారు. కాలనీలో ప్రతీ ఇంటికీ కనెక‌్షన్‌ ఇచ్చేందుకు రోడ్లను వరుసగా పగలగొట్టడంతో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. మున్సిపల్‌ సిబ్బంది రోడ్డును ధ్వంసం చేయకుండా రోడ్డుకింద మట్టిని తవ్వి పైపులైన్‌ పనులు పూర్తి చేస్తున్నారు. పెద్దపెద్ద కొండలకు కూడా సొరంగం వేసి, పైపులైన్లు ఏర్పాటు చేసే టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న ఐహెచ్‌పీ సాంకేతికతను అందిపుచ్చుకోకుండా రోడ్లను ధ్వంసం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

గతుకుల ప్రయాణం తప్పదా..
జిల్లా కేంద్రంలో 62,097 నివాసాలు (అపార్ట్‌మెంట్లతో పాటు) ఉన్నాయి. వీటిలో 32 వేల కొళాయి కనెక‌్షన్లు ఉన్నాయి. ఇందులో రోడ్లు ధ్వంసం చేసి 21 వేల కనెక‌్షన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అనంతపురం నగరంలోని రోడ్లన్నీ గతుకులుగా మారిపోతాయి. 5(ఇంటు) 15 మీటర్ల మేర రోడ్డు వేయాలంటే రూ.లక్ష ఖర్చవుతుంది. ఈలెక్కన రోడ్లన్నీ తిరిగి నిర్మించాలంటే కనీసం రూ.150 కోట్ల నిధులు అవసరం. ప్రస్తుతం పగలగొడుతున్న రోడ్ల పనులకు ‘ప్యాచ్‌వర్క్‌’ చేయాలి. కాంక్రీట్‌ వర్క్‌ పూర్తి చేసి 21 రోజులపాటు క్యూరింగ్‌ చేయాలి. ఇది చేసినా ప్యాచింగ్‌ నిలవదు. ఈ రోడ్డులో వెళ్లినా అడుగుకో స్పీడ్‌బ్రేకర్‌పై ప్రయాణం చేసినట్లవుతుంది. ఇలా కాంక్రీట్‌ వర్క్‌కు రూ.18 కోట్లు కేటాయించారు. రోడ్డుకు ఇబ్బంది లేకుండా పైపులైన్‌ నిర్మిస్తే భారీగా నిధులు ఆదా అయ్యే అవకాశం ఉంది.

ఈ పనుల్లోనూ తిరకాసే
పైపులైన్‌ నిర్మాణంలో మొదట ఇసుక వేసి, తర్వాత పైపులు వేయాలి. నీటి పరఫరా అయినప్పుడు ఆ ఒత్తిడికి పైపు పగిలిపోకుండా ఇసుక కొంత వరకు రక్షణ కల్పిస్తుంది. ఇసుక లేకుండానే పనులు చేస్తున్నారు. ఇదేమంటే ప్రత్యేకంగా జీఓ తెచ్చుకున్నామని చెప్తున్నారు. ఇసుక వేయకపోవడంతో రూ.3 కోట్ల మేర ఏజెన్సీకి నిధులు ఆదా అవుతాయి. అలాగే రోడ్ల పక్కన పైపులైన్‌ పనుల కోసం గోతులు తవ్వారు. వీటిని నిర్మాణ సంస్థే పూడ్చి చదును చేయాలి. కానీ ఈ పనులను చేయడం లేదు. వీటిని ఇంటి యజమానులే చేసుకుంటున్నారు.

ప్రజాప్రతినిధుల నిర్లిప్తత
ఏడాదిగా పనులు గందరగోళంగా జరుగుతున్నా ‘అనంత’ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదు. పనులకు ముందే రూ.7.50 కోట్లు కీలక ప్రజాప్రతినిధులకు అందడంతోనే పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రజాప్రతినిధి తన అస్మదీయులైన కార్పొరేటర్ల ద్వారా అధికారపార్టీ కార్పొరేటర్లకు కూడా నిధుల పంపకాలు జరిగాయని తెలుస్తోంది. దీంతోనే పైపులైన్‌ పనులు ఎలా జరుగుతున్నా అందరూ మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో దాదాపు రూ.25 నుంచి రూ.30 కోట్లు దుర్వినియోగమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement