- పిఠాపురం పింఛన్ల బాగోతంపై కదిలిన అధికారులు
- ‘సాక్షి’ వరుస కథనాలతో విచారణ
- 40 శాతం అక్రమాలేనని ప్రాథమిక నిర్ధారణ
- ఇద్దరు చిరుద్యోగులపై వేటు
- అసలు సూత్రధారుల మాటేమిటో?!
అర్హులైన లబ్ధిదారుల కళ్లల్లో కారం కొట్టి.. అక్రమార్కులకు పింఛన్లను దోచిపెట్టిన వ్యవహారం గుట్టు రట్టయ్యింది. ‘సాక్షి’ సాగించిన అక్షర సమరంతో.. దాచిపెడదామన్నా దాగని నిజాలు.. పుట్టలోని నాగుల్లా బయటకు వచ్చేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో.. అధికార పార్టీ ముఖ్య నేత అండతో.. ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున పింఛన్లను అనర్హులకు కట్టబెట్టిన వ్యవహారంపై అధికారులు కదిలారు. ఇద్దరు చిరుద్యోగులపై వేటు వేశారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పిఠాపురం పింఛన్ల బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలు కలకలం రేపాయి. ‘భర్తలు బతికున్నా.. వితంతు పింఛన్లు!’ శీర్షికన 9వ తేదీ ప్రధాన సంచికలోను, ‘అంతా వితంతే!’ శీర్షికన 10వ తేదీ జిల్లా మొదటి పేజీలోను ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం స్పందించింది. పింఛన్ల అక్రమాలపై చురుకుగా విచారణ చేపట్టింది. ‘సాక్షి’ ఏదైతే చెప్పిందో అదంతా నూరు శాతం వాస్తవమేనని ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చింది. ఈ అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి పిఠాపురం మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ వేణును సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజేష్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సరెండర్ చేశారు. మరోపక్క కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వీఆర్‌ఓలతో కూడా రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు సస్పెండైన జూనియర్ అసిస్టెంట్ వేణుపై ప్రత్యేక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, మొత్తం పింఛన్ల బాగోతంపై లోతైన విచారణ జరపాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ సీహెచ్.నాగనరసింహరావును మున్సిపల్ ఆర్‌డీ ఆదేశించారు.
‘మమ’ అనిపించేద్దామనుకున్నా..
తొలుత స్థానిక మున్సిపల్ అధికారులతో విచారణనుæ మమ అనిపించేద్దామనే ప్రయత్నం జరిగింది. దీనిపై ఈ నెల 11వ తేదీన ‘దొంగ చేతికే తాళాలు’ శీర్షికన ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆగమేఘాల మీద రెవెన్యూ యంత్రాంగంతో స్వతంత్ర విచారణకు శ్రీకారం చుట్టారు. విచారణాధికారిగా కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబును నియమించారు. ఆదివారం సెలవు దినమైనా ఆర్డీఓతోపాటు పిఠాపురం నియోజకవర్గ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలతో కలసి ఆయన మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత పింఛన్లకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం తదితర నియోజకవర్గాల నుంచి వీఆర్‌ఓలను రప్పించి పిఠాపురంలో ఆదివారం విచారణ చేపట్టారు. ఒక్క పిఠాపురం మున్సిపల్ పరిధిలో మంజూరు చేసిన 321 పింఛన్లలోనే సగానికి పైగా అక్రమార్కుల చేతుల్లోకి పోయాయని ప్రాథమికంగా నిర్ధారించారు. వయస్సు, కులం, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఏ పత్రాలూ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్టు నిగ్గు తేల్చారు. 321 పింఛన్లపైనా విచారణ చేపట్టగా, ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అక్షర సత్యమని తేల్చారు.
ఆదివారం రాత్రికి 16 వార్డుల్లో విచారణ ప్రాథమికంగా పూర్తి చేశారు. అందులో 40 శాతం పైనే అక్రమాలు బయటపడ్డాయని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆన్‌లైన్‌లో మాత్రం అన్ని సర్టిఫికెట్లూ ఉన్నట్టు చూపించారు. వాస్తవంగా చూస్తే ఓసీ సామాజిక వర్గానికి చెందినవారిని గీత కార్మికులుగా కూడా చూపించి పింఛన్లు కట్టబెట్టారు. గొర్రెల సత్యవతి, తిరువీధుల వీరలక్ష్మి, కొల్లు అమ్మాజీ.. ఈ ముగ్గురి భర్తలూ బంగారంలా బతికే ఉన్నారు. కానీ వితంతు పింఛన్లు పొందుతున్న విషయాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో అక్రమాలన్నీ వాస్తవమనే తేల్చారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమమార్గంలో పింఛన్లు పొందుతున్న మరో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే యోచనలో ఉన్నారు. పింఛన్ల అక్రమాలపై 24 గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలంటూ కలెక్టర్ ఆదేశించారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఎంతమాత్రం తమ తప్పు లేదని విచారణాధికారికి మున్సిపల్ ఉద్యోగులు విన్నవించినట్టు సమాచారం. తమను బెదిరించి తప్పు చేయించారే తప్ప తామేమీ కావాలని చేయలేదని వారు చెప్పుకున్నారు.
బలవుతున్నది చిరుద్యోగులే..
ఈ మొత్తం వ్యవహారంలో చిరుద్యోగులే బలైపోతున్నారని, అసలైన సూత్రధారులకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బాగోతం వెలుగులోకి వచ్చి రోజులు గడిచేకొద్దీ ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఒక పింఛన్ మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రక్రియలు పూర్తి చేయాలి. అటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్న చిరుద్యోగులనే బాధ్యులను చేసి, బలిపశువులను చేయడం ఎంతవరకూ సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులకు అంత అడ్డగోలుగా పింఛన్లు మంజూరు చేసినప్పుడు, మున్సిపాలిటీలోని వివిధ సెక‌్షన్లలో ఉన్న అధికారులు నోరు మెదపకుండా మిన్నకుండి పోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులెవరో నిగ్గు తేల్చాలన్న డిమాండ్ వస్తోంది. ఇన్ని అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో మొత్తం పింఛన్లను రద్దు చేసి, కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, అర్హులైనవారికి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో జన్మభూమి కమిటీలకు ఎటువంటి సంబంధమూ లేదని స్థానిక ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సర్టిఫికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అక్రమాలపై ఒకపక్క విచారణ జరుగుతున్న సమయంలో.. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతాలని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విచారణ నిష్పక్షపాతంగా జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది.