పింఛన్ల వంచన నిజమే | pithapuram pension scam | Sakshi
Sakshi News home page

పింఛన్ల వంచన నిజమే

Published Fri, Feb 17 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

పింఛన్ల వంచన నిజమే

పింఛన్ల వంచన నిజమే

‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
బోగస్‌ పింఛన్లు 86 పైనే అని తేల్చిన అధికారులు
సర్కార్‌ చేతికి నివేదిక– ఇక చర్యలే మిగిలాయి
కమిషనర్‌ సహా అరడజను మందిపై వేటు...?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. పిఠాపురంలో పింఛన్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని రుజువైంది. పిఠాపురం మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గ మొత్తంమీద పింఛన్ల పంపిణీని అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు తమ గుప్పెట్లో పెట్టుకుని ఎడాపెడా పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాగోతాన్ని  
‘భర్తలుండగానే వితంతు పింఛన్లు’, ... ‘అంతా వి‘తంతే’, ... ‘దొంగ చేతికి తాళాలు’ శీర్షికలతో ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వరుస కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం శాఖాపరంగా చేపట్టిన విచారణ ముగిసింది. ఓ వైపు మున్సిపల్‌ రీజనల్‌ డైరక్టర్, మరోపక్క జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీఓ లంకే రఘుబాబు వేర్వేరుగా విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరమే ఈ బాగోతానికి బాధ్యులుగా గుర్తించి పిఠాపురం మున్సిపల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ వేణును సస్పెండ్‌ చేయగా, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజేష్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సరెండర్‌ చేశారు.  క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి విచారణ పూర్తి చేసి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారని కలెక్టరేట్‌ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆ నివేదిక కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెళ్లింది. తుది పరిశీలన పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఒకటే మిగిలింది. విచారణలో నిగ్గుతేలిన అంశాలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటే మాత్రం పిఠాపురం మున్సిపాలిటీలో మూడొంతులు మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడటం ఖాయమంటున్నారు. ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదికలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
నివేదికలో అంశాలిలా...
పిఠాపురం నియోజకవర్గంలో జన్మభూమి సందర్భంగా కొత్తగా రెండువేల పింఛన్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక్క పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మంజూరుచేసిన 321 పింఛన్లలో సగానికి పైనే అక్రమార్కుల చేతుల్లోకి పోయాయని ప్రాథమికంగా నిర్థారించారు. వయస్సు, కులం, మరణ ధ్రువీకరణ పత్రాలు...ఇలా ఏ పత్రం లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్టు నిగ్గు తేలింది. 321 పింఛన్లపైనా విచారణ చేపట్టగా ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అక్షర సత్యమని తేల్చారు. వీటిని స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రమేయం లేకుండా జన్మభూమి కమిటీల సభ్యులు భర్తలున్న వారిని చనిపోయినట్టు దొంగ రికార్డులు సృష్టించి అనర్హులకు పింఛన్లను కట్టబెట్టేశారు. కల్లుగీత కార్మికులు, వడ్రంగి వంటి చేతి వృత్తుల వారి పేర్లతో ఓసీలకు కూడా పింఛన్లు మంజూరు చేశారని విచారణలో బయటపడిందని సమాచారం. 
ఈ రకంగా ఒక్క పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 86 పింఛన్లు అనర్హులకు పంపిణీ చేశారని లెక్క తేల్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ 86 పింఛన్లను రద్దు చేయాలని నివేదించాలని తొలుత భావించారని, కానీ ఒకే విడత పంపిణీ చేసిన పింఛ¯ŒSలలో ఇన్ని అవకతవకలు జరగడంతో పిఠాపురం మున్సిపాలిటీలో పంపిణీ చేసిన రెండువేల పైచిలుకు పింఛన్లను రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సిఫారసు చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అరడజను మంది బాధ్యులుగా గుర్తింపు...
ఈ వ్యవహారంలో పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్, మున్సిపల్‌ మేనేజర్, ముగ్గురు సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌లు, గుమస్తాలు...ఇలా అరడజన్‌ మంది మున్సిపల్‌ ఉద్యోగులను బాధ్యులుగా గుర్తించారని కలెక్టరేట్‌ వర్గాల సమాచారం. బాధ్యులైన వీరిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవాలని సిఫారసు చేశారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అధికాపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చర్యలకు వెనుకాడితే చెప్పలేం కానీ, అవేవీ అడ్డురాకుంటే మాత్రం పిఠాపురం మున్సిపాలిటీలో నివేదికలో ప్రస్తావించిన ఆరుగురు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఖాయమంటున్నారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందంటున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement