రైతులతో ఆడుకుంటున్నారు
♦ రెవెన్యూ అధికారులపై చంద్రబాబు నిప్పులు
♦ డబ్బు కోసం లిటిగేషన్లు పెడుతున్నారు
♦ గుంటూరు జిల్లాలో ‘మీ ఇంటికి-మీ భూమి’ రెండో విడత ప్రారంభం
♦ సభా వేదికపై తహసీల్దార్, ముగ్గురు వీఆర్వోలకు హెచ్చరికలు
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రెవెన్యూ శాఖపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమిపై రైతు కంటే రెవెన్యూ శాఖకే పెత్తనం ఎక్కువగా ఉంటోందని, రెవెన్యూ అధికారులు డబ్బు కోసం లిటిగేషన్లు పెట్టి రైతులతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు, చింతలపూడి గ్రామాల్లో ‘మీ ఇంటికి-మీ భూమి’ రెండో విడత కార్యక్రమాన్ని ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ తగాదాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. ఒక్క గ్రామంలోనే ఎన్ని లిటిగేషన్లు పెట్టారో స్వయంగా చూశానని తెలిపారు. జవాబుదారీతనం తీసుకువస్తానని ప్రకటించారు.
సర్వేలు చేయకుండా తిప్పుకుంటున్నారు
ములుకుదురు, చింతలపూడి గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రైతులంతా రెవెన్యూ అధికారుల తీరును తప్పుపట్టారు. సీఎం సైతం రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. రెవెన్యూ సిబ్బంది తలచుకుంటే ఒకరి పేరుతో ఉన్న భూమి మరొకరి పేరుపైకి వెళుతుందని, పట్టాదారు పాస్‌పుస్తకాలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అయితే మరీ ఘోరంగా ఉందన్నారు. ఈ శాఖ సిబ్బంది ఒకరి భూమిని మరొకరికి రిజిష్టర్ చేసేస్తారని, అడవులు, వాగులను కూడా ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అన్నారు. వీరికి ఒక నిబంధన అంటూ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. సర్వే డిపార్టుమెంట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదన్నారు. రూ.20 కోట్లు ఖర్చు చేసి యంత్రాలు కొనిస్తే సర్వేలు చేయకుండా తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరు తహసీల్దార్‌తోపాటు ముగ్గురు వీఆర్వోలను వేదికపైకి పిలిచి మరీ హెచ్చరించారు.
ప్రజలను చైతన ్యపరచండి
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంత్రులు, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.