'ఆత్మహత్యలు వద్దు.. ప్రభుత్వం మీతోనే'
హైదరాబాద్: అనావృష్టితోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీంతోపాటు గత పాలకుల తీరు వల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు కూడా వారి ఆత్మహత్యలకు కారణమైందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం రైతుల ఆత్మహత్యలపైనే ప్రధానంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి పోచారం మాట్లాడారు. సాధారణ రుతుపవనాల ఆగమనం 2015 జూన్ 13నే ప్రారంభమవడంతో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాధార పంటలు వేశారని చెప్పారు.
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోని కొన్ని ప్రాంతాలు తప్ప వర్షాలు బాగానే పడ్డాయని, పంటలు మాత్రం కొంత ప్రభావానికి లోనయ్యాయని తెలిపారు. వర్షాభావం కారణంగా కరీంనగర్, నల్లగొండ జిల్లాలో 50శాతం పంటలు, నిజమాబాద్, మెదక్ జిల్లాలో 75శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 100శాతం పంటలు నష్టపోయాయని చెప్పారు. 17వేల కోట్ల రైతుల రుణమాఫీలో సగం చెల్లించామని, మిగితా సగాన్ని మొత్తం ఒక్కసారి చెల్లించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని వివరించారు. నాణ్యమైన విద్యుత్, విత్తనాలు అందించడంలాంటి చర్యలకు పాల్పడిన క్షేత్ర స్ధాయి పరిశీలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుండటం కొంత బాధాకరమని చెప్పారు. రైతులెవరూ అధైర్య పడవొద్దని, విపరీత చర్యలకు దిగవొద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.