formers suicide issue
-
'రైతులకు భరోసా ఇవ్వాలి'
-
'రైతులకు భరోసా ఇవ్వాలి'
హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలే రైతుల ఆత్మహత్యలకు కారణం అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. మంగళవారం రైతుల ఆత్మహత్యల ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలను వివరించారు. ఎక్కువమంది యువ రైతులు, మహిళా రైతులే చనిపోయారని చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయని చెప్పారు. అందులో అప్పుల వడ్డీ చెల్లించడం, రుణాలు ఇవ్వనీ బ్యాంకులు, కౌలుదారి చట్టాన్ని అమలుచేయలేకపోవడం, అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారులు పీడించడం, ప్రభుత్వం తరుపున రైతులకు సరైన భరోసా లేకపోవడం ప్రధాన అంశాలని చెప్పారు. సెప్టెంబర్ 11న ఆత్మహత్యల విషయంలో మంత్రి పోచారం మాట్లాడుతూ అవి ఆత్మహత్యలే కాదని అన్నారని, అలా అనడం ఏమాత్రం సరికాదని చెప్పారు. ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సిందిపోయి అలా మాట్లాడితే ఎంతవరకు సమంజసం అని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, విత్తన ఉత్పత్తి చేసే ప్రైవేట్ సంస్థలను నియంత్రించాలని కోరారు. -
'మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి'
హైదరాబాద్: రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కూడా రైతు ఆత్మహత్యలు జరిగాయని, అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయంలో ప్రత్యారోపణలకు పోకుండా ఆత్మహత్యలు నివారించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఆత్మహత్యల అంశంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా పాయం మాట్లాడారు. సరైన వర్షాలు లేక రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని, మనోధైర్యం కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వం వారికి భరోసాగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో 400కు పైగా కరువు మండలాలు ఉన్నా.. వాటి గురించి కేంద్రానికి నివేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరువు మండలాల ప్రకటన విషయంలో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఇక పంటల బీమా విషయంలో మరింత ఉదారంగా ఉండాలని, వారికి చెల్లించే బీమా ప్రస్తుతం రుణంలో 50శాతం ఉందని, దానిని 75శాతం పెంచాలని కోరారు. బీమా చెల్లిస్తే డబ్బు తిరిగి రాదనే భావన రైతుల్లో ఉందని, అందుకే పంటల బీమాకు వెనుకాడుతున్నారని చెప్పారు. ఇక ఎరువుల నిల్వకు, పంట నిల్వలకు గోదాముల కరువు తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో భూసార పరీక్ష కేంద్రాలు నాలుగు ఉండగా అందులో రెండే పనిచేస్తున్నాయని, వాటికి పరీక్షల కోసం మట్టిని పంపిస్తే సరైన సమయంలో నివేదిక రావడం లేదని తెలిపారు. గ్రామంలో విత్తన ఉత్పత్తి చేస్తే రైతులు నమ్మడం లేదని, అందుకే గ్రామంలో శుద్ధి చేసిన విత్తనాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తే రైతులకు భరోసాగా ఉంటుందని తెలిపారు. స్వామినాథన్ కమిటీతోపాటు పలు కమిటీలు చేసిన సిఫారసులు గమనించి అమలు చేయాలని, ఆత్మహత్యలు నివారించాలని కోరారు. -
'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం'
-
'కేసీఆర్ ఆదర్శ రైతు.. అభినందనీయం'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పరోక్షంగా సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శ రైతు అని అభినందిస్తూనే ఎకరాకు కోటి రూపాయలు పండిస్తే మరి ఇజ్రాయెల్ కు వెళ్లడం ఎందుకో అని ప్రశ్నించారు. మెరుగైన పంటల పరిశీలనల పేరిట ఇజ్రాయెల్, చైనా వెళ్లారని, మరి ఆ టూర్లకు రైతులను తీసుకెళ్లారా అని నిలదీశారు. తక్కువ పొలంలో ఎక్కువ దిగుబడిని తీసుకొచ్చే కేసీఆర్ ఎమ్మల్యేలను, రైతులను ఆయన ఫాం హౌజ్‌కు తీసుకెళితే తాము కూడా నేర్చుకుంటామని చెప్పారు. ముందు ఫాం హౌజ్ రైతులకు సబ్సిడీ ఇవ్వడం ఆపేసి పేద రైతులకు సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. సీఎం ఫాం హౌజ్‌లో పంటలు పండించినట్లుగానే మిగితా ప్రాంతాల్లో కూడా రైతులు పంటలు పండిచేలా కృషి చేస్తే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. -
'రాష్ట్రం ధనికమైనదే.. కానీ రైతులు పేదవారు'
-
'రాష్ట్రం ధనికమైనదే.. కానీ రైతులు పేదవారు'
హైదరాబాద్: ఇప్పటికి ప్రభుత్వం కొంత దిగివచ్చిందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు సమస్యల మీద చర్చించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు స్పీకర్‌కు కృతజ్ఞతలని చెప్పారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల అంశంపై ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగినదని, అందుకు ధన్యవాదాలని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, ప్రొఫెసర్ కోదండరాం చెప్పినట్లయినా వినాలని చెప్పారు. రాష్ట్రంలో 1400మంది రైతులు చనిపోయారని, వారిని ఆదుకోవాలని, రుణమాఫీ మొత్తం ఒకేసారి చెల్లించాలని కోరారు. కరువు మండలాల విషయంలో ప్రభుత్వం అలసటత్వంతో ఉందని, దీనిపై కేంద్రానికి వెంటనే నివేదిక పంపిచాలని కోరారు. ఇప్పటికే 14 రాష్ట్రాలు నివేదిక పంపించాయని చెప్పారు. కేంద్రప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయం అందుతుందని, ఆ మేరకు తాము కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కరువు మండలాలు ప్రకటిస్తే పరువు పోతుందా లేక ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ధనికమైందే కానీ, అక్కడి రైతులు, ప్రజలు పేదవాళ్లనే విషయం మరిచిపోవద్దని చెప్పారు. 280 మండలాల్లో వర్షాలు లేనే లేవని, మూడు సార్లు విత్తనాలు వేసినా మొలకెత్తలేదని, మూడోసారి మొలకెత్తినా అవి చెట్టుగా ఎదగలేదని చెప్పారు. భూపాలపల్లి, జనగామలో వర్షాలు పడినా సకాలంలో పడకపోవడంతో వరి పొలాలే లేకుండా పోయాయని, తన పంటలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని, పిట్టల కధలు చెప్పిన టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మారని అన్నారు. అయినా, గత ప్రభుత్వాలపై విమర్శల దాడి చేస్తూ వెళితే ప్రజలు ఛీదరించుకుంటారని, అధికార స్థానంలో ఉండి ప్రశ్నలు వేయడం మానుకొని సమాధానాలని చెప్పాలని అన్నారు. పత్తి ధర విషయంలో చంద్రబాబు సహాయం చేశారని ఎర్రబెల్లి చెప్తుండగా మంత్రులు నవ్వుతుండగా మంత్రులు సిగ్గు లేకుండా నవ్వుతున్నారని ఎర్రబెల్లి అనడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. అన్ పార్లమెంటరీ మాటలు ఉపయోగించకూడదని, ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పడంతో అందుకు అంగీకరించిన ఎర్రబెల్లి తన ప్రసంగం కొనసాగించారు. -
'ఆత్మహత్యలు వద్దు.. ప్రభుత్వం మీతోనే'
-
'ఆత్మహత్యలు వద్దు.. ప్రభుత్వం మీతోనే'
హైదరాబాద్: అనావృష్టితోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీంతోపాటు గత పాలకుల తీరు వల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు కూడా వారి ఆత్మహత్యలకు కారణమైందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం రైతుల ఆత్మహత్యలపైనే ప్రధానంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి పోచారం మాట్లాడారు. సాధారణ రుతుపవనాల ఆగమనం 2015 జూన్ 13నే ప్రారంభమవడంతో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాధార పంటలు వేశారని చెప్పారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోని కొన్ని ప్రాంతాలు తప్ప వర్షాలు బాగానే పడ్డాయని, పంటలు మాత్రం కొంత ప్రభావానికి లోనయ్యాయని తెలిపారు. వర్షాభావం కారణంగా కరీంనగర్, నల్లగొండ జిల్లాలో 50శాతం పంటలు, నిజమాబాద్, మెదక్ జిల్లాలో 75శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 100శాతం పంటలు నష్టపోయాయని చెప్పారు. 17వేల కోట్ల రైతుల రుణమాఫీలో సగం చెల్లించామని, మిగితా సగాన్ని మొత్తం ఒక్కసారి చెల్లించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని వివరించారు. నాణ్యమైన విద్యుత్, విత్తనాలు అందించడంలాంటి చర్యలకు పాల్పడిన క్షేత్ర స్ధాయి పరిశీలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుండటం కొంత బాధాకరమని చెప్పారు. రైతులెవరూ అధైర్య పడవొద్దని, విపరీత చర్యలకు దిగవొద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.