హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలే రైతుల ఆత్మహత్యలకు కారణం అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. మంగళవారం రైతుల ఆత్మహత్యల ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలను వివరించారు. ఎక్కువమంది యువ రైతులు, మహిళా రైతులే చనిపోయారని చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయని చెప్పారు.
అందులో అప్పుల వడ్డీ చెల్లించడం, రుణాలు ఇవ్వనీ బ్యాంకులు, కౌలుదారి చట్టాన్ని అమలుచేయలేకపోవడం, అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారులు పీడించడం, ప్రభుత్వం తరుపున రైతులకు సరైన భరోసా లేకపోవడం ప్రధాన అంశాలని చెప్పారు. సెప్టెంబర్ 11న ఆత్మహత్యల విషయంలో మంత్రి పోచారం మాట్లాడుతూ అవి ఆత్మహత్యలే కాదని అన్నారని, అలా అనడం ఏమాత్రం సరికాదని చెప్పారు. ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సిందిపోయి అలా మాట్లాడితే ఎంతవరకు సమంజసం అని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, విత్తన ఉత్పత్తి చేసే ప్రైవేట్ సంస్థలను నియంత్రించాలని కోరారు.
'రైతులకు భరోసా ఇవ్వాలి'
Published Tue, Sep 29 2015 1:46 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement