'రాష్ట్రం ధనికమైనదే.. కానీ రైతులు పేదవారు'
హైదరాబాద్: ఇప్పటికి ప్రభుత్వం కొంత దిగివచ్చిందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు సమస్యల మీద చర్చించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు స్పీకర్కు కృతజ్ఞతలని చెప్పారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల అంశంపై ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగినదని, అందుకు ధన్యవాదాలని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, ప్రొఫెసర్ కోదండరాం చెప్పినట్లయినా వినాలని చెప్పారు.
రాష్ట్రంలో 1400మంది రైతులు చనిపోయారని, వారిని ఆదుకోవాలని, రుణమాఫీ మొత్తం ఒకేసారి చెల్లించాలని కోరారు. కరువు మండలాల విషయంలో ప్రభుత్వం అలసటత్వంతో ఉందని, దీనిపై కేంద్రానికి వెంటనే నివేదిక పంపిచాలని కోరారు. ఇప్పటికే 14 రాష్ట్రాలు నివేదిక పంపించాయని చెప్పారు. కేంద్రప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయం అందుతుందని, ఆ మేరకు తాము కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కరువు మండలాలు ప్రకటిస్తే పరువు పోతుందా లేక ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ధనికమైందే కానీ, అక్కడి రైతులు, ప్రజలు పేదవాళ్లనే విషయం మరిచిపోవద్దని చెప్పారు. 280 మండలాల్లో వర్షాలు లేనే లేవని, మూడు సార్లు విత్తనాలు వేసినా మొలకెత్తలేదని, మూడోసారి మొలకెత్తినా అవి చెట్టుగా ఎదగలేదని చెప్పారు. భూపాలపల్లి, జనగామలో వర్షాలు పడినా సకాలంలో పడకపోవడంతో వరి పొలాలే లేకుండా పోయాయని, తన పంటలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని, పిట్టల కధలు చెప్పిన టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మారని అన్నారు.
అయినా, గత ప్రభుత్వాలపై విమర్శల దాడి చేస్తూ వెళితే ప్రజలు ఛీదరించుకుంటారని, అధికార స్థానంలో ఉండి ప్రశ్నలు వేయడం మానుకొని సమాధానాలని చెప్పాలని అన్నారు. పత్తి ధర విషయంలో చంద్రబాబు సహాయం చేశారని ఎర్రబెల్లి చెప్తుండగా మంత్రులు నవ్వుతుండగా మంత్రులు సిగ్గు లేకుండా నవ్వుతున్నారని ఎర్రబెల్లి అనడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. అన్ పార్లమెంటరీ మాటలు ఉపయోగించకూడదని, ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పడంతో అందుకు అంగీకరించిన ఎర్రబెల్లి తన ప్రసంగం కొనసాగించారు.