భూ సమస్యను పరిష్కరించండి
Published Tue, Aug 9 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
ఆ తరువాతే ప్లాట్ల కేటాయించండి
లేకుండా సీఆర్‌డీఏకు తాళాలు వేస్తాం..
డిప్యుటీ కలెక్టర్‌ను చుట్టుముట్టిన ఐనవోలు రైతులు
తుళ్లూరు రూరల్ : ‘గ్రామకంఠాల సమస్యను పరిష్కరించకుండా ప్లాట్ల పంపిణీకి ఒప్పుకునేది లేదు. కాదని చేస్తే సీఆర్‌డీఏ కార్యాలయానికి తాళాలు వేస్తాం’ అంటూ ఐనవోలు రైతులు డిప్యుటీ కలెక్టర్‌ను అడ్డుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో భాగంగా సోమవారం డిప్యుటీ కలెక్టర్ ఏసురత్నం ఐనవోలులోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చారు. గత కొద్దిరోజులుగా గ్రామస్తులు గ్రామకంఠాల సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవిస్తూవచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సీఆర్‌డీఏ కార్యాలయాన్ని మందడం గ్రామానికి తరలించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు అధికారులను నిలదీశారు. ఆ సమయంలో కొంత సమయం ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యకు పరిష్కారం కనిపించకపోవటంతో సోమవారం గ్రామానికి వచ్చిన డిప్యుటీ కలెక్టర్‌ను చుట్టుముట్టారు. సీఆర్‌డీఏ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రోజులు గడుస్తున్నా గ్రామకంఠాల సమస్య పరిష్కరించకుండా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టడాన్ని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించిన తరువాతే ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చని. అలా కాకుండా చేస్తే సీఆర్‌డీఏ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు. దీంతో డిప్యుటీ కలెక్టర్ ఏసురత్నం రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు.
Advertisement
Advertisement