హాయ్‌.. ఏఐ | Every problem solution with artificial intelligence! | Sakshi
Sakshi News home page

AI Usage in Hyderabad: ప్రతి సమస్యకూ కృత్రిమ మేధతో చెక్‌!

Published Sat, Sep 21 2024 6:35 AM | Last Updated on Sat, Sep 21 2024 6:38 AM

Every problem solution with artificial intelligence!

సృజనాత్మకతకు పదును పెడుతున్న యువత 

ఉద్యోగాల కన్నా స్టార్టప్‌లే మేలంటున్న యూత్‌ 

ఏఐ, ఎంఎల్‌ సాంకేతికత సాయంతో అద్భుతాలు 

హైదరాబాద్‌లో రానున్న ఏఐ సిటీతో మరిన్ని అవకాశాలు 

కృత్రిమ మేధ.. సాంకేతిక విప్లవంలో మానవుడి ఆలోచనలకు అందనంత దూరం వెళ్లిపోయింది. మెషీన్‌ లెర్నింగ్, డీప్‌ లెరి్నంగ్‌ సాయంతో మనిషి కూడా చేయలేని ఎన్నో పనులకు పరిష్కారం చూపుతోంది. భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మించాలని ప్రణాళికలు కూడా రచిస్తోంది. యువత కూడా ఏఐలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమ సృజనాత్మకతకు పదును పెడుతోంది. ఏఐతో నడిచే కొత్త కొత్త యాప్‌లను సృష్టించి.. ఎన్నో చిక్కుముడులను విప్పుతోంది. ఏదో ఒక ఉద్యోగం చేయడం కన్నా.. సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమాజానికి తమ చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టీ–హబ్‌ వేదికగా ఎన్నో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. ఎన్నో స్టార్టప్‌లకు టీ–హబ్‌ ప్రోత్సాహం అందిస్తోంది.   

సాధారణంగా మనుషుల జాతకం గురించి 
వినే ఉంటాం. కానీ వాహనాలకు కూడా జాతకం ఉంటుందా అనే కదా మీ అనుమానం. ఏఐతో వాహనం జాతకం గురించి చెప్పే యాప్‌ను చరణ్‌ సింగ్, మల్లికారెడ్డి అనే ఇద్దరు యంగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ తీసుకొచ్చారు. వీళ్లు రూపొందించిన చిన్న పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుంది. దాన్ని కనుక వాహనానికి అమర్చుకుంటే వాహనం కండీషన్‌ ఎలా ఉందో ఎప్పటికప్పుడు మన మొబైల్‌ ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఎప్పుడు బ్రేక్‌డౌన్‌ అవుతుంది.. ఎప్పుడు సరీ్వసింగ్‌ చేయించాలి.. అన్న వివరాలను మనకు తెలుపుతూ ఉంటుంది. 

వాహనం ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని మనకు చెబుతుందన్న మాట. 2018లోనే ఈ ఐడియాతో ఓ స్టార్టప్‌ మొదలు పెట్టాలని భావించారు. చివరకు 2022లో దీన్ని ప్రారంభించి ఔరా అనిపించుకుంటున్నారు. సాధక్‌ అనే ఈ పరికరంతో వాహనాల లైఫ్‌టైం భారీగా పెంచుకోవచ్చని చరణ్‌ సింగ్‌ చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తుందని ముందే పసిగట్టి చెబుతుంది కాబట్టి అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవడం లేదా జాగ్రత్తలు పాటించడం ద్వారా వాహనం షెడ్డుకు వెళ్లకుండా కాపాడుకోవచ్చని వివరించారు. వేక్‌.ఇన్‌ అనే పోర్టల్‌ ద్వారా వీరు సేవలు అందిస్తున్నారు.

మూసీ పరిరక్షణలోనూ ఏఐ.. 
మూసీ ప్రక్షాళనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించట్లేదు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో కనుక్కొని ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అయితే కృత్రిమ మేధతో పరిష్కారం చూపుతామని కొందరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ముందుకొచ్చారు. నాలుగు దశల్లో మూసీని పూర్తిగా పరిశుభ్రం చేయొచ్చని చెబుతున్నారు. తొలుత డ్రోన్ల సాయంతో మూసీ నదిలో, పరీవాహక ప్రాంతంలోని చెత్తను తొలగించాలని పేర్కొంటున్నారు. సెన్సార్ల ద్వారా మూసీలో చెత్త వేస్తే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది. అంతేకాదు.. వరదలు, విపత్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వరదలు రావడానికి ముందే ముప్పును పసిగట్టి స్థానికులకు సమాచారం అందజేస్తుంది. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికారులు త్వరగా సహాయక చర్యలు చేపట్టే వీలు కలి్పస్తుంది. అర్బన్‌ ప్లానింగ్‌లో కూడా కృత్రిమ మేధను వినియోగించుకుని, భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రణాళికలు రచించవచ్చని పేర్కొంటున్నారు. ఇక, ఎక్కడెక్కడ బ్రిడ్జిలు అవసరం ఉన్నాయనే విషయం కూడా కృత్రిమ మేధ చెప్పేస్తుందని చెబుతున్నారు.  

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను పట్టేసేలా..
ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తించేందుకు కృత్రిమ మేధ సాయంతో వినూత్నంగా కళ్లద్దాలను పర్వ్యూ ఎక్స్‌ అనే కంపెనీ అభివృద్ధిపరిచింది. వీటిని ధరించిన పోలీసు జస్ట్‌ అలా వాహనాన్ని తరచి చూస్తే చాలు.. కృత్రిమ మేధ సాయంతో సమాచారం మన ముందుంచుతుంది. డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్, అద్దాలు ఉన్నాయా లేదా ఇలా అన్ని వివరాలను ఫోన్‌కు పంపుతుంది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చలాన్లు కూడా జెనరేట్‌ చేసి, వాహనదారుడికి పంపుతుంది. ఉన్నతాధికారులకు ఈ విషయాలను పంపుతుంది. వాయిస్‌ రూపంలో సదరు అధికారికి వివరాలను చెబుతోంది. అలాగే ట్రాఫిక్‌ ఎలా ఉందనే వివరాలను కూడా అంచనా వేసి, ట్రాఫిక్‌ నియంత్రణలో మేలు చేస్తుంది. చాలా కచి్చతత్వంతో వివరాలను నమోదు చేస్తుంది. అలాగే దీంతో కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకత పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.

భవిష్యత్తు ఏఐదే.. 
భవిష్యత్తులో మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏఐ నిర్ణయించే రోజు వస్తుంది. మనం చేయాల్సిన ప్రతి పనినీ ఏఐ అ«దీనంలోకి తీసుకుంటుంది. కృత్రిమ మేధతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది. కాకపోతే ఏఐని సరైన క్రమంలో మలుచుకుని, స్కిల్స్‌ పెంచుకుంటే మాత్రం      కృత్రిమ మేధ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.  
– చరణ్‌సింగ్, వేక్‌ వ్యవస్థాపకుడు

స్టార్టప్‌లో పనిచేస్తూ సొంతంగా.. 
స్టార్టప్‌ ఏర్పాటు చేసే ముందు ఏదైనా స్టార్టప్‌ కంపెనీలో పనిచేస్తే మంచిది. అందులో ఉండే కష్టనష్టాలు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడితే.. నిర్వహణలో విజయం సాధించవచ్చు. నేను కూడా అలా ముందు ఓ కంపెనీలో పనిచేసి.. సొంతంగా స్టార్టప్‌ స్థాపించాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా సంస్థను నడిపిస్తున్నాను. మా బాబాయి మెకానిక్‌. ఆయన లాంటి మెకానిక్‌లకు ఉపయోగపడేలా ఏదైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వేక్‌ను స్థాపించాను.    
 – మల్లికారెడ్డి, వేక్‌ సహ వ్యవస్థాపకురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement