ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... హోదాకు బదులుగా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించామన్నారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని వెంకయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును ఐదేళ్లపాటు కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు అన్ని ముందుగానే తొలగించామని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. 1981లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని... కానీ నాటి నుంచి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏ పారిశ్రామికవేత్త చెప్పలేదన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని మరోసారి వెంకయ్య స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని తెలిపారు.
అంతకుమందు విశాఖపట్నం విమాశ్రయంలో దిగిన ఎం వెంకయ్యనాయుడుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు కార్యాలయం వరకు ర్యాలీగా వెంకయ్యను తీసుకువచ్చారు.