పోలవరానికి గండి కొట్టేందుకే ‘పురుషోత్తపట్నం’
పోలవరానికి గండి కొట్టేందుకే ‘పురుషోత్తపట్నం’
Published Sun, Aug 21 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
రాయవరం : పోలవరం ప్రాజెక్టుకును అడ్డుకునేందుకు నాడు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి సంఘాల రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మండిపడ్డారు. శనివారం వారిక్కడ విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.1,600 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏ మేరకు రైతులకు ప్రయోజనాలను చేకూర్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడంలో భాగంగానే చంద్రబాబు మరో ఎత్తుగడకు శ్రీకారం చుడుతున్నారని విమర్శించా రు. రూ.1,600 కోట్లతో సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ప్రతిపాదిస్తున్న ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరిలో నీటిని ఏలేరు కాలువ ద్వారా విశాఖపట్నానికి తరలించాలని యోచిస్తున్నట్టు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కట్టవద్దంటూ గతంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు తెలంగాణ వాసులు కూడా నానాయాగీ చేశారని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు అవసరం లేకుండా రెండు ఎత్తిపోతల పథకాలు కట్టుకోవాలని గతంలో వారు చేసిన డిమాండ్‌నే ఇప్పుడు చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన స్పిల్‌వే నిర్మాణ పనులకు రూ.4,700 కోట్లను ట్రాన్స్‌టాయ్‌కు కంపెనీకి అప్పగించారని తెలిపారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల ఖర్చును స్పిల్‌వే నిర్మాణానికి కేటాయిస్తే, పోలవరం ప్రాజెక్టు మొదటి భాగం పూర్తవుతుందని వివరించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా, మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత మంతెన అచ్యుతరామరాజు ఉన్నారు.
Advertisement
Advertisement