‘పోలవరం’ భూసేకరణ పూర్తి
‘పోలవరం’ భూసేకరణ పూర్తి
Published Sun, Mar 12 2017 1:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయిందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని జాతీయ రహదారులు, రైల్వేఅభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల పోలవరం ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ పూర్తయిందని ఇంకా 4,200 ఎకరాల ఎసైన్‌మెంట్ భూమి మాత్రమే అప్పగించాల్సి ఉందన్నారు. భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే కాకుండా నిర్వాసితులకు పునరావాస చర్యలు చేపట్టడంలో కూడా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 4,200 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకుని ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని సహాయక చర్యలు అమలు చేస్తామని, రికార్డులన్నీ పక్కాగా ఉండాలన్నారు. ఎసైన్‌మెంట్ భూమిలో పేదలు ఎప్పటి నుంచి అక్రమించుకుని ఉన్నారు? చట్టబద్ధంగా తహసీల్దార్లు పట్టాలు ఎప్పుడు ఇచ్చారో వాటి సమగ్ర సమాచారం రికార్డుల్లో పొందుపర్చి ఉందా? పేదలకు స్థలాలు ఇచ్చేటప్పుడు ఎసైన్‌మెంట్ కమిటీ ఆమోదం ఉందా ప్రస్తుతం ఆక్రమణదారుడు వాస్తవంగా స్థలంలో ఉన్నడా తదితర అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని కలెక్టర్ భాస్కర్ సబ్ కలెక్టర్ షాన్‌మోహన్‌ను ఆదేశించారు. పెరవలి లాకుతో పాటు జూన్ నాటికి డెల్టాలోని 8 ప్రాంతాల్లో కాలువలపై ప్రస్తుతం ఉన్న పాత షట్టర్ల స్థానే కొత్త షట్టర్లు ఏర్పాటు చేసి తీరాలని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌ను ఆదేశించారు.పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇంటింటా వంట గ్యాస్ అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని, కొవ్వూరు నుంచి ఏలూరు వరకు గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ పూర్తయిన దృష్ట్యా తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, ఐటీడీఏ పీవో షాన్‌మోహన్, సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, కొవ్వూరు, జేఆర్ గూడెం ఆర్డీవోలు శ్రీనివాసరావు, లవన్న పాల్గొన్నారు.
ఆక్రమణలకు గురైనా పట్టించుకోరా?
అన్ని నిర్ణయాలు హైదరాబాద్‌లో అయితే ఇక్కడ కమిటీ ఎందుకు? వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేయడంలో వక్ఫ్ బోర్డు మూడు నెలలైనా పట్టించుకోకపోతే ఎలా? అని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి వక్ఫ్ ఆస్తుల రక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలో 321 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయని స్పష్టమైన సమాచారంతో వక్ఫ్ బోర్డుకు వివరాలు వెల్లడించినా ఆక్రమణదారులకు కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదని ఇలాంటప్పుడు సమావేశం నిర్వహించడం ఎందుకని కలెక్టర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వక్ఫ్‌బోర్డు అన్ని నిర్ణయాలు తీసుకునేలా ఉంటే జిల్లాస్థాయిలో ఈ సమావేశాలు నిర్వహించినా ఫలితమేమిటని ప్రశ్నించారు. కమిటీ తీసుకున్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికపై వక్ఫ్ బోర్డు అమలు చేసే పరిస్థితి ఉండాలే తప్ప కనీసం ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడానికి కూడా వక్ఫ్ బోర్డు ఆదేశాల కోసం నెలల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉంటే వక్ఫ్ ఆస్తులను జిల్లాలో ఎలా పరిరక్షించగలుగుతామని ప్రశ్నించారు. ఆస్తుల పరిరక్షణలో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి వక్ఫ్ బోర్డు సీరియస్‌గా స్పందించకపోతే పాలన ముందుకు సాగదన్నారు. ఏలూరు మెయి¯ŒSబజార్‌లో అతిపురాతమైన ఫకీర్ తకియా ఖాదర్ జుండా దర్గాను కొంతమంది ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదుపై ఇంకా ఎందుకు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ షేక్ నూర్ సాహెబ్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్న వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణానికి అవసరమైన రూ.36 లక్షల నిధులను కలెక్టర్ మంజూరు చేశారు. ఏజేసీ ఎంహెచ్.షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, అటవీశాఖాధికారి నాగేశ్వరరావ పాల్గొన్నారు.
Advertisement
Advertisement