పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేయాలి: ఉండవల్లి
పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేయాలి: ఉండవల్లి
Published Wed, Aug 3 2016 11:55 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఓ మంత్రి 'స్టాప్ వర్క్ ఆర్డర్' అనే ఆదేశాలను 2016 జూలై 7వ తేదీ వరకు అబెయన్స్‌లో పెట్టామన్నారని, ఇప్పుడు ఆ ఆదేశాలు అమలులో లేవు కాబట్టి.. పోలవరం పనులు ఆపేయాల్సి ఉంటుందని ఉండవల్లి తెలిపారు. వాస్తవానికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దాన్ని పూర్తిగా కేంద్రమే కట్టడంతో పాటు ఆర్అండ్ఆర్ కూడా కేంద్రమే చూడాలని చట్టంలో ఉందని.. కానీ అది ఏమాత్రం అమలు కావట్లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు కూడా కేంద్రమే ఇప్పించాలని, తెలంగాణ వాళ్లు అనుమతి ఇచ్చేసినట్లే లెక్క అన్నారని.. ఇవన్నీ చట్టంలో ఉన్నాయని ఉండవల్లి గుర్తుచేశారు. కానీ ఈ విషయంలో ఒడిషా ఎంపీ మహంతి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం చూస్తే కడుపు మండిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ''పోలవరం జాతీయప్రాజెక్టు అని సింపుల్‌గా చట్టంలో పేర్కొన్నారు. దానికి వ్యతిరేకంగా నేను చర్యలు తీసుకోలేను. సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టిపారేస్తే ప్రభుత్వం కూడా కొట్టేస్తుంది. అప్పటివరకు మేం ఏమీ చేయలేం'' అని అరుణ్ జైట్లీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
జైట్లీకి మనమంటే లోకువా?
అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కూడా జైట్లీ ఏపీని చాలా పలుచన చేసి మాట్లాడారని అన్నారు. ఎక్స్, వై, జడ్, ఏ, బీ, సీ... ఇలా ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రం డబ్బులు అడిగితే ఇస్తూ పోవడం పద్ధతి కాదని, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నట్లుగా జైట్లీ మాట్లాడారని తెలిపారు. ''రాజకీయ కారణాల వల్ల ఇష్టం వచ్చినట్లు డబ్బు ఇవ్వడం సరికాదు. చంద్రబాబు ప్లాన్ చేసినట్లుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలి. అందుకు కావల్సిన సాయం చేస్తాం. పైప్‌లైన్ పద్ధతిలో నిధులిస్తూ వెళ్తాం'' అని ఆయన అన్నారన్నారు. దేశంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేయొచ్చని అన్నారని.. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు మాత్రం బిహార్, ఒడిషాలాంటి రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయంటూ ఆపుతున్నారని, వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని ఆయన తెలిపారు.
విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఉండవల్లి అన్నారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు సమన్యాయం అంటూనే ఉన్నారని.. దానికి అర్థం ఏంటో ఎవరికీ ఇంతవరకు అర్థం కావట్లేదని విమర్శించారు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటో ఇప్పుడైనా చెప్పొచ్చు కదా.. తాను రహస్యంగా మన్మోహన్ సింగ్‌కు చెప్పానని, ఆయన వినిపించుకోలేదని లేనిపోని విషయాలు చెప్పి అందరినీ మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. అప్పట్లో రాష్ట్రపతి రాష్ట్ర విభజన గురించి ఒక నోట్ పంపి, అసెంబ్లీ అభిప్రాయం అడిగారని, నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ సత్యనారాయణ కూడా దాన్నివ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారని ఉండవల్లి అన్నారు. కానీ దేశంలో ఇంతవరకు ఎక్కడా లేనట్లుగా.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం దాని మీద లేచి నిలబడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన స్ఫష్టం చేశారు. ఏమైనా అంటే కాంగ్రెస్ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని అంటున్నారని.. కానీ ఆనాటి సభలో మీ ఎంపీలు గుండు సుధారాణి, నామా నాగేశ్వరరావు తదితరులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ఒక్క మాట 'నో' అన్నా రాష్ట్ర విభజన ఆగిపోయేదని.. ఈనాటికీ రాష్ట్రం ఒక్కటిగానే ఉండేదని ఆయన అన్నారు.
Advertisement
Advertisement