
పుష్కరాలకు తరలిన పోలీసులు
హిందూపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్‌స్టేషన్‌ల నుంచి అధికారులు, సిబ్బంది పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. జిల్లావ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 51 మంది ఎస్‌ఐలు, 192 మంది ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు, 552 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 17 మంది మహిళా హోంగార్డులను విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాలకు విధులకు పంపిస్తున్నారు. వీరందరు 17 రోజుల పాటు పుష్కరాల ఘాట్‌ల వద్ద బందోబస్తు నిర్వహిస్తారు.
కాగా ఇందులో పెనుకొండ సబ్ డివిజన్‌కు సంబంధించి ఇద్దరు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 60 మంది ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు, 160 మంది కానిస్టేబుళ్లు, 12 మంది మహిళా పోలీసులు, 64 మంది హోంగార్డులు విధులకు తరలివెళ్లారు. ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి పుష్కరాల విధులకు సిబ్బంది తరలివెళ్లడంతో స్టేషన్లన్నీ ఖాళీ అయ్యాయి. హిందూపురంలోని ప్రతి స్టేషన్‌లో ఇద్దరు హెచ్‌సీలు, ఇద్దరు పీసీలు, సీఐ మాత్రమే స్థానికంగా ఉన్నారు. అలాగే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఒక పోలీస్ తప్ప అందరూ పుష్కర విధులకు వెళ్లారు. హిందూపురం, పెనుకొండ స్టేషన్ల నుంచి పోలీస్ సిబ్బంది తరలివచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తరలివెళ్లారు.