- 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- హాజరు కానున్న 21,140 మంది అభ్యర్థులు
6న పోలీసు రిక్రూట్‌మెంట్ టెస్ట్
Published Thu, Nov 3 2016 11:35 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(టౌన్): పోలీస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6న పరీక్ష జరుగనుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరుగనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 21,140 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు 75 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుని బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించుకోవాలి. ఒక్క నిముషం ఆలస్యమయినా పరీక్షలకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంగా ప్రకటించారు. కేంద్రానికి సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలను అనుమతించరు. అభ్యర్థులు ఒక రోజు ముందుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. బ్లూ, నలుపు బాల్ పాయింట్ పెన్నులతో మాత్రమే పరీక్షలు రాయాల్సి ఉంది. పరీక్షకు హాజరయ్యేవారు తమ ఒరిజినల్ ఫొటోతోపాటు ఇతర ఏదైనా గుర్తింపు కార్డును కూడా తీసుకురావాల్సి ఉంది. అధికారులు ఆర్‌టీసీ బస్టాండ్ నుంచి దూరప్రాంత కేంద్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఉదయం 7.30 గంటలకు ఒక బస్సును, 8.00 గంటలకు మరో బస్సును ఏర్పాటు చేశారు. ముత్తుకూరు రోడ్డులోని, బుచ్చిరెడ్డిపాళెంలోని గీతాంజలి పరీక్షాకేంద్రాలకు, నార్త్ రాజుపాళెంలోని శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల, కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల, ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల సెంటర్లకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ముత్తుకూరు రోడ్డులోని గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్, బుచ్చిరెడ్డిపాళెం రోడ్డులోని గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, టెక్నాలజీ కళాశాలల తేడాలను గమనించాలని అధికారులు సూచించారు. నిప్పో ఫ్యాక్టరీ సమీపంలోని రిత్విక్ ఎన్‌క్లేవ్‌లో రత్నం హైస్కూలు, హరనాథపురంలోని రత్నం హైస్కూలు సెంటర్ల తేడాలను గుర్తించాలని అధికారులు తెలిపారు. పోలీసు రిక్రూట్‌మెంట్ టెస్ట్ జిల్లా కన్వీనర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామమోహన్‌రావు వ్యవహరిస్తున్నారు.
Advertisement