నెల్లూరు(క్రైమ్): కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. సోమవారం వారు నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. వివరాలిలా ఉన్నాయి. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంకు చెందిన జి.రామచంద్రయ్య రెండో కుమార్తె సుమతి నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తూ నగరంలోని హరనాథపురంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం రాపూరుకు చెందిన కారు డ్రైవర్ మాతయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో సుమతి కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో ఈనెల రెండో తేదీన సుమతి, మాతయ్యలు రాపూరులో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు.
సుమతి హాస్టల్‌లో లేదన్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు గాలించారు. ఫలితం లేకపోవడంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాతయ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రేమజంట జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని ఏఎస్పీని కోరారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన నాలుగో నగర పోలీసులను ఆదేశించి ప్రేమజంటను ఆ స్టేషన్‌కు పంపారు. ఇన్‌స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా నిరాకరించింది. తన ఇష్ట్రపకారామే వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇరుకుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment