మహిళా సంఘాలపై రాజకీయ పెత్తనం
– నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఎంఎస్ అధ్యక్షులు
– రెండేళ్లు దాటినా కొత్త వారిని ఎన్నుకోని వైనం
– రాజకీయ నేతల కనుసన్నల్లో మండల సమాఖ్యలు
– వత్తాసు పలుకుతున్న ఏపీఎంలు, ఏసీలు
అనంతపురం టౌన్ : మహిళా సంఘాలపై రాజకీయం స్వారీ చేస్తోంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిబంధనల ప్రకారం గ్రామ సంఘాలు, మండల, జిల్లా సమాఖ్యల్లో ఆఫీస్ బేరర్స్ (అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి) పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. రెండవ సంవత్సరం పోటీ చేయవచ్చును అయితే మూడో సంవత్సరం పోటీకి అర్హత ఉండదు.
కానీ జిల్లా వ్యాప్తంగా 14 మండలాల అధ్యక్షులకు పదవీ కాలం ముగిసినా అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఆత్మకూరు, కూడేరు, ధర్మవరం, రామగిరి, తాడిమర్రి, కనగానపల్లి, గాండ్లపెంట, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గోరంట్ల, అమరాపురం, తనకల్లు, గుంతకల్లు, విడపనకల్లు మండల సమాఖ్య అధ్యక్షులు రెండేళ్లకు పైబడినా ఇంకా అధ్యక్షులుగానే కొనసాగుతున్నారు. పదవీ కాలం రెండేళ్లు ముగియగానే మండల స్థాయిలో ఉన్న ఏపీఎంలు, క్లస్టర్ స్థాయిలోని ఏరియా కో ఆర్డినేటర్లు ఎన్నికలు నిర్వహించేలా చూడాలి. అయితే వీరు పట్టించుకోలేదు. తమకు అనుకూలమైనవారు అధ్యక్షులుగా ఉంటే తాము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని భావించడంతో పాటు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఉన్నత స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా దీనిపై ఆరా తీసిన దాఖలాలు లేవు. జిల్లా సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన బహిర్గతమైంది.
నిబంధనలు ఇలా..:
ఆఫీస్ బేరర్స్ ఎన్నికలు జరపడానికి 30 రోజుల ముందు పాలకవర్గం సభ్యులకు నోటీసుల ద్వారా సమాచారం ఇవ్వాలి. అర్హత ఉన్న ఓటరు జాబితాను తయారు చేసి సంస్థల కార్యాలయాల్లో ప్రదర్శించాలి. నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ సీఆర్పీలతో తప్పనిసరిగా ఆఫీస్ బేరర్స్‌కు కావాల్సిన అర్హతలు, విధులు, బాధ్యతలపై శిక్షణ ఇవ్వాలి.
మండల సమాఖ్యల్లో ఎన్నికలు జరిగేటప్పుడు జిల్లా సమాఖ్య ఈసీ సభ్యుల నుంచి, జిల్లా సమాఖ్యలో ఎన్నికలు జరిగితే ఇతర జిల్లాల్లోని జిల్లా సమాఖ్యల ఈసీ సభ్యుల నుంచి గానీ, రిజిస్ట్రేషన్ సీఆర్పీల నుంచి గానీ ఎన్నికల నిర్వహణాధికారిని ఈసీ సభ్యుల ఆమోదంతో నియమించుకోవాలి. కానీ జిల్లా సమాఖ్య ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఏకంగా 14 మందికి పదవీ కాలం ముగిసిందంటూ ఓటు హక్కు కల్పించలేదు. చివరకు రచ్చ కావడంతో సర్దుబాటు చర్యలు చేపట్టారు. కాగా పదవీ కాలం ముగిసినా 14 మంది అధ్యక్షులుగా ఎలా కొనసాగుతున్నారన్నది అధికారులకే తెలియాలి. ఈ క్రమంలో ఏసీలు, ఏపీఎంలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ప్రశ్నార్థకం.
––––––
పరిశీలిస్తాం..
ఆయా మండలాల నుంచి రికార్డులు తెప్పించి పరిశీలిస్తా. పదవిలో ఎలా కొనసాగుతున్నారో చూడాలి. ఎన్నికలకు సంబంధించి విధివిధానాలకు లోబడి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం.
– వెంకటేశ్వర్లు, పీడీ, డీఆర్‌డీఏ
––––––