విద్యుదాఘాతంలో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
రామచంద్రపురం(అవనిగడ్డ): మండల పరిధిలోని రామచంద్రపురం దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రాయి యస్వంత్‌రెడ్డి (16) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటిపూడికి చెందిన యస్వంత్‌రెడ్డి నాలుగు నెలల క్రితం దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ కోర్సులో చేరాడు. రామచంద్రపురంలోని కళాశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. బుధవారం రాత్రి స్నానం చేసిన తరువాత ఇనుపతీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఇది గమనించిన వసతిగృహ సిబ్బంది వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షచేసిన వైద్యులు అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మణికుమార్ చెప్పారు. శుక్రవారం నుంచి కళాశాలకు దసరా సెలవులు ఇవ్వాల్సి ఉండగా, యస్వంత్‌రెడ్డి మృతితో గురువారం నుంచి కళాశాలకు సెలవులిచ్చారు.
ఒక్కగానొక్క కొడుకు!
కంటిపూడికి చెందిన వెంకటరెడ్డి, సుజాతకు యస్వంత్‌రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే ఈ కుటుంబం పలు ఇబ్బందులు ఎదురైనా తమ కుమారుడుని ఉన్నత చదువులు చదివించుకుని ప్రయోజకుడిని చేయాలనుకున్నారు. ఈ నే పథ్యంలో అల్లారు ముద్దుగా పెంచుకుని చదివించుకుంటున్న కొడుకు ఇలా మరణించడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, సర్పంచి నలుకుర్తి పృధ్వీరాజ్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు వైద్యశాలకు చేరుకుని మృతుని తల్లిదండ్రులను పరామర్శించారు.